రవీంద్రభారతి, ఆగస్టు 2 : ప్రజలకు సేవ చేసే వాళ్లనే ఆదరిస్తారని, ప్రజాసేవకే తన జీవితం అంకితమని, సేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని, ట్రస్ట్ ద్వారా అనేక సేవలు చేస్తున్నానని గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం హైదరాబాద్లోని రవీంద్రభారతి సమావేశ మందిరంలో శాంతి కృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ సౌజన్యంతో ఓటమి ఎరుగని నేతగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒక్కసారి ఎంపీగా గెలిచి, 40 ఏళ్లుగా రాజకీయ ప్రస్థానంలో ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేస్తున్న మంత్రి ఎర్రబెల్లికి జనబంధు బిరుదును ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రబెల్లి ట్రస్ట్ ద్వారా కరోనా కష్టకాలంలో వేలాది మందిని ఆదుకున్నట్లు తెలిపారు. 10వేల మంది మహిళలకు కుట్టుమిషన్లు ఉచితంగా అందజేశామన్నారు. వేలాది మంది యువకులకు ఉపాధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించానని, 17వేల మందికి డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పించినట్లు చెప్పారు. ప్రజల్లో ఉండి సేవ చేసే వాళ్లనే ప్రజలు ఆదరిస్తారని, అందుకే వరుసగా తనను గెలిపిస్తున్నారన్నారు. ఏమి చేసినా ప్రజల రు ణం తీర్చుకోలేనన్నారు. సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నిజమైన నాయకుడు గుండెతో ఆలోచిస్తాడని, ఆ లక్షణం మంత్రి ఎర్రబెల్లిలో చూశానని చెప్పా రు. కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, సినీ నిర్మాత దిల్రాజు, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, దైవజ్ఞశర్మ, మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, రామచంద్రయ్యశర్మ పాల్గొన్నారు.