హనుమకొండ చౌరస్తా ఏప్రిల్ 24 : వరంగల్ జిల్లా మామునూర్ విమానాశ్రయానికి తెలంగాణ సిద్దాంత కర్త ఆచార్య జయశంకర్ పేరు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ అధ్యక్షుడు డాక్టర్ వేములవాడ మదన్ మోహన్, గౌరవాధ్యక్షుడు డాక్టర్ లాలుకోట వెంకటాచారి, ప్రధాన కార్యదర్శ చొల్లేటి కృష్ణమాచార్యులు, కోశాధికారి రాగిఫణి రవీంద్రాచారి అన్నారు.
ఆచార్య జయశంకర్ సార్ తెలంగాణ మట్టిలో పుట్టి, ఆ మట్టి విముక్తి కోసం, తెలంగాణ ప్రజల మనోభావాలను, ఆకాంక్షలను తమ జీవిత లక్ష్యంగా ఆయన చేసిన త్యాగానికి, విలువలకు, అజరామరమైన కృషికి గుర్తుగా ఆయన స్వస్థలమైన వరంగల్ జిల్లాలో ఉన్న మామునూర్ విమానాశ్రయానికి ఆయన పేరు ఇవ్వడం అనేది సముచితం అన్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రజల గౌరవాన్ని జయశంకర్ త్యాగానికి విలువలను నిలబెట్టే ఒక చారిత్రాత్మక అవకాశమన్నారు. మామునూర్ విమానాశ్రయానికి జయశంకర్ సార్ పేరు పెట్టి, ఆ మహానుభావుడుకి అర్హమైన గౌరవాన్ని అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వారు కోరారు.