“కాంగ్రెసోళ్లు రాళ్లు, పెట్రోల్ పోసి తగలపెడతామంటే భయపడతాం అనుకున్నరా? ఇది కేసీఆర్ తయారుచేసిన బృందం.. కేసీఆర్ దళం.. ఎవరికీ భయపడం. మానుకోట రాళ్ల మహత్యమేమిటో ‘తెలంగాణ’ను అడ్డుకున్న ప్రతి ఒక్కడికీ తెలుసు. మానుకోటలో 14 ఏళ్ల కిందనే నిప్పు పుట్టింది. తర్వాత తెలంగాణ వచ్చింది. మీరు పర్మిషన్ ఇవ్వమంటే కోర్టుకు పోయి తెచ్చుకున్నం.
వెయ్యి మందితో ధర్నా అనుకుంటే 25వేల మంది తరలివచ్చారు. రేవంత్ సర్కారుపై ప్రజల్లో ఎంత కోపమున్నదో, ఎంత వ్యతిరేకత ఉన్నదో ఈ మహాధర్నా చూస్తుంటే తెలుస్తున్నది. తెలంగాణలో ఏ గిరిజన ఆడబిడ్డకు అన్యాయం జరిగినా రాష్ట్రం మొత్తం కదలాలి. కదంతొక్కాలి. దీనికి సిద్ధంగా ఉండాలి” అంటూ మానుకోట మహాధర్నా వేదిక నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
మానుకోట కదంతొక్కింది. రేవంత్ సర్కారు నియంతృత్వ పోకడను నిరసిస్తూ తండాలు, గూడేల నుంచి గిరిజనం కదలివచ్చింది. లగచర్లతో పాటు దళిత, గిరిజన రైతుల పట్ల నియంతృత్వ వైఖరికి నిరసనగా మహబూబాబాద్‌లో సోమవారం బీఆర్ఎస్ నిర్వహించిన మహాధర్నాకు వేలాదిగా రావడంతో కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది.
ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై.. అటు సర్కారు తీరును ఎండగట్టడంతో పాటు రాష్ట్రంలో గిరిజన, ఆదివాసీ, లంబాడాలే కాదు.. ఎక్కడ ఎవరికి ఏ కష్టమొచ్చినా మేమున్నామంటూ మానుకోట నుంచే అభయమిచ్చి.. ధైర్యంచెప్పడంతో గిరిజనుల్లో సంతోషం వెల్లివిరిసింది. మహాధర్నా విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది.
– మహబూబాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ)/మహబూబాబాద్ రూరల్
ఆనాటి ఉద్యమస్ఫూర్తితో యావత్ తెలంగాణ ప్రజల పక్షాన మానుకోట గడ్డ నుంచి రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా పోరును ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది. హైకోర్టు అనుమతితో ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ధర్నా నిర్వహించగా, వేలాదిగా తరలివచ్చిన దళిత, గిరిజన రైతులతో ప్రాంగణం కిటకిటలాడింది. మధ్యాహ్నం 12గంటలకు ధర్నా స్థలికి బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకోగా, నాయకులు, రైతులు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, రైతులను అదుపుచేయడం ఇబ్బందిగా మారింది. కేటీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేయడంతో ఆయ న ప్రసంగాన్ని మధ్యలో ఆపి అలా అనొద్దని వేడుకున్నారు. కేటీఆర్ స్టేజీపైకి వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు యువత ఉత్సాహం చూపింది. ధర్నా ముగిసిన తర్వాత కారు ఎకుతున్న సమయంలో నాయకులు, కార్యకర్తలు తమ సెల్ఫోన్లో కేటీఆర్ ఫొటోలు తీసుకునేందుకు పోటీపడ్డారు. మానుకోటలో మహాధర్నా విజయవంతం కావడం జిల్లా పార్టీ నాయకుల్లో ఉత్సాహం నింపింది.
సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీలను మొదట అమలుచేయాలి. ప్రతిసారి కేసీఆర్, కేటీఆర్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడకుండా ప్రజలకు మేలుచేసేలా పాలనపై శ్రద్ధ చూపాలి. గత పదేళ్లలో కేసీఆర్ దళితులు, గిరిజనుల అభ్యున్నతి కోసం ఎంతో పాటుపడ్డారు. గిరిజనులకు ఆరు నుంచి పది శాతం రిజర్వేషన్ అందించారు. సీఎం సొంత నియోజకవర్గంలోని లగచర్ల రైతులపై ఒత్తిడి చేయకుండా వారిపై పెట్టిన కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి. లగచర్ల రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుంది.
– తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్సీ
సీఎం రేవంత్‌రెడ్డి లగచర్ల గిరిజన రైతులను హింసిస్తున్నడు. కొడంగల్ నియోజకవర్గంలో అతడి అనుచరులతో కలిసి అనేక దుర్మార్గపు పనులు చేస్తున్నాడు. గిరిజనులు ఐక్యంగా ఉండి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా లగచర్ల రైతులకు మద్దతుగా ఉండాలి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి దుమ్ములో కొట్టుకుపోయాడు. కాంగ్రెస్ సర్కారుకు బుద్ధి వచ్చేలా ప్రతి ఒక్కరూ కలిసి రావాలి.
– మాలోత్ కవిత, మాజీ ఎంపీ, బీఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు
తెలంగాణలో గిరిజనుల అభివృద్ధి కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు అమలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం వారిని అణగదొక్కుతున్నారు. కేసీఆర్ పాలనకు, రేవంత్‌రెడ్డి పాలనకు ఎంతో తేడా ఉంది. కేసీఆర్ ప్రతి గిరిజన బిడ్డకు అండగా ఉన్నారు. తండాలకు సకల సౌకర్యాలు కల్పించారు. రేవంత్‌రెడ్డి గిరిజనుల పట్ల దారుణంగా వ్యవహరిస్తూ ఒత్తిడి తెస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమ కోసం అనేక పథకాలు తీసుకువస్తే రేవంత్‌రెడ్డి వాటన్నింటిని బంద్ చేశారు.
– రెడ్యా నాయక్, మాజీ ఎమ్మెల్యే
ఏడాది కాలంలోనే రేవంత్‌రెడ్డి పాలనపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారు. రేవంత్‌రెడ్డి అధికార పగ్గాలు చేపట్టగానే ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. సీఎం స్థాయి మరిచి బీఆర్ఎస్ పార్టీ, నాయకులపై ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. అమాయకులైన గిరిజన ప్రజలను జైలుకు పంపించాడు. కాంగ్రెస్‌కు ప్రజలు అతి త్వరలోనే బుద్ధి చెబుతారు.
– శంకర్‌నాయక్, మాజీ ఎమ్మెల్యే
మానుకోటలో నిర్వహించిన మహాధర్నా సందర్భంగా కళాకారుల ఆటపాటలు అందరినీ ఆకట్టకున్నాయి. మానుకోట ప్రసాద్ నేతృత్వంలోని బృందం పలు గీతాలను ఆలపించింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ, రేవంత్‌రెడ్డిపై పాడిన పాటలకు సభికుల నుంచి విశేష స్పందన వచ్చింది. ప్రసాద్ పాడిన పాటకు గిరిజన రైతులతో కూర్చున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సైతం స్టెప్పులేశారు. తన వద్ద ఉన్న రుమాలను ఊపుతూ సభికులను ఉత్సాహపరిచారు. బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్న సమయంలో మానుకోట ప్రసాద్ ‘అన్నా రామన్న’ అనే పాట పాడుతుండగా రైతులందరూ లేచి తమ వద్ద ఉన్న కండువాలను ఊపుతూ స్వాగతం పలికారు.