మొగుళ్లపల్లి, జూలై 31 : ప్రభుత్వ గురుకుల హాస్టళ్లలో కుళ్లిన కూరగాయలతో వంటలు వండుతున్నారని, కాంగ్రెస్ పాలనలో వసతి గృహాల నిర్వహణ అధ్వానంగా ఉందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకులం, కొరికిశాల కేజీబీవీ పాఠశాలను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతితో కలిసి గురువారం సందర్శించారు.
ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా ప్రభుత్వం గురుకులాల్లో సరైన వసతులు కల్పించలేదన్నారు. ఎంజేపీ గురుకుల పాఠశాలలో నీటి సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారని, సమస్యను తక్షణమే పరిషరించాలని అధికారులకు సూచించారు. మిషన్ భగీరథ నీటిని ఎకువ మొత్తంలో సరఫరా అయ్యేలా చూడాలని సంబంధిత అధికారులతో మాజీ ఎమ్మెల్యే గండ్ర ఫోన్లో మాట్లాడారు.
గురుకుల పాఠశాలలో కరెంటు వైర్లు వేలాడుతున్నాయని, క్లాస్ రూంలో స్విచ్ బోర్డులు లేవని, నీటి కుళాయిల నిర్వహణ సరిగా లేదన్నారు. విద్యార్థులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని, వాటిని సరిచేసేలా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గురుకులాల్లో సోలార్ లైట్స్, సోలార్ వాటర్ హీటర్ అమార్చాలని కలెక్టర్‌ను కోరారు. కేజీబీవీలో మెనూ ప్రకారం భోజనం తయారు చేయడం లేదని నిర్వాహకులపై మండిపడ్డారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు గురుకులా ల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంటే వారికి చదువులకు దూరమయ్యే పరిస్థితి ఉంటుందన్నారు.
మొలకెత్తిన, కుళ్లిన కూరగాయలతో విద్యార్థులకు వండి పెడుతున్నారని, సరైన బెడ్స్ అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే గురుకులాల్లో పరిస్థితి మెరుగుదిద్దాలని, లేకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా బాలికల విద్యాలయంలో విద్యార్థినుల సౌకర్యార్థం నాపిన్ స్టాండ్‌ను గండ్ర జ్యోతి అందచేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతి రావు, మాజీ జడ్పీటీసీ జోరుక సదయ్య, మాజీ సర్పంచులు నైనకంటి ప్రభాకర్ రెడ్డి, దానవేణి రాములు, నాయకులు గుడిమల్ల రమేశ్, దేవునురి కుమార్ ఉన్నారు.