‘ప్రైవేట్’ పోటీని తట్టుకోలేక ఏడేళ్ల క్రితం ఆ పాఠశాల మూతపడే పరిస్థితికి చేరింది. గ్రామస్తులు, దాతలు, ఎన్ఆర్ఐలు, పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు చేయీచేయీ కలిపి నిలబెట్టిన ఆ బడి ఇప్పుడు కార్పొరేట్‌ను దలదన్నేలా నడుస్తున్నది. ఒకప్పుడు 55 మంది విద్యార్థులే ఉన్న ఈ స్కూల్ ఇప్పుడు 170మంది పిల్లలతో కళకళలాడుతున్నది. ఇక్కడ సకల సౌకర్యాల నడుమ అమలవుతున్న ‘ఇంగ్లిష్ మీడియం’ బోధనే ఈ బడి దశను మార్చింది. డిజిటల్ క్లాసులు, ప్రత్యేక లైబ్రరీ, గోడలపై ఆకట్టునే చిత్రాలతో మండలంలోని పాఠశాలలకు ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో మరింత బలోపేతం కానున్నది.
నర్సింహులపేట, జనవరి 27 : మూత పడుతుందనుకున్న పాఠశాల గ్రామస్తుల సహకరంతో ప్రైవేట్‌కు దీటుగా కొనసాగుతున్నది. ఏడేళ్ల కిందట 55 మందితో వెలవెలబోయిన ఈ స్కూల్లో అప్పటి హెచ్‌ం శ్రీధర్ ఇంగ్లిష్ మీడియాన్ని ప్రారంభించారు. 1 నుంచి 7వ తరగతి వరకు ఉన్న ఇక్కడ అన్ని తరగతుల్లోనూ ఆంగ్లమాధ్యమంలో బోధిస్తున్నారు. దీంతో ఇప్పుడు 170 మంది విద్యార్థులతో ఈ పాఠశాల కళకళలాడుతున్నది. నిపుణులైన ఉపాధ్యాయులు డిజిటల్ తరగతులతో నాణ్యమైన బోధన అందిస్తున్నారు. తరగతి గోడలపై ఇంగ్లిష్‌లో రాసిన రాతలు, చిత్రా లు పాఠశాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సకల వసతులతో ఆంగ్ల మాధ్యమంలో నడుస్తున్న జయపురం ప్రాథమికోన్నత పాఠశాల మండలానికే ఆదర్శంగా నిలిచింది.
గ్రామస్తుల కృషి.. దాతల సహకారం
పాఠశాల అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి తోడు పులువురు గ్రామస్తులు ముందుకు వచ్చి తమ వంతుగా సహకారం అందించారు. దాతలు, ఎన్ఆర్ఐలు, పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, పలువురు ప్రజా ప్రతినిధులు చేయీచేయీ కలిపి బడి అభివృద్ధికి బాటలు వేశారు. పాఠశాలలో డిజిటల్ తరగతుల నిర్వహణ కోసం గ్రామానికి చెందిన నేలకుర్తి వేదారెడ్డి ప్రొజెక్టర్ అందించారు. విద్యుత్ సరఫరాలో ఆటంకం కలుగకుండా ఎండీ జానీ రూ.20వేలతో ఇన్వర్టర్ సమకూర్చారు. పాఠశాల ఆవరణలో స్టేజీ, వర్షం వచ్చినా ఇబ్బందులు లేకుండా షెడ్ కోసం నెలకుర్తి అరుణారెడ్డి, డొనికెన రాము రూ. 30 వేలు, కంప్యూటర్లకు పాశం చెన్నారెడ్డి రూ.16వే లు, ప్రింటర్ కోసం రాము రూ. 5వేలు, ఎస్బీఐ బ్యాంకు వారు కంప్యూటర్, 5 ఫ్యాన్లకు రూ.40వేలు, నెలకుర్తి నర్సింహారెడ్డి మైక్‌సెట్ కోసం రూ.6 వేలు, పాఠశాల పెయింటింగ్ కోసం రావుల శ్రీను రూ.5 వేలు, జంపాల రామ్మూర్తి రూ.3వేలు, మందుల యాకన్న రూ. 3250 ఇలా చాలా మంది గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధి కోసం విరాళాలు అందించారు. బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో లైబ్రరీ ఏర్పాటు చేశారు. విద్యార్థులు కూర్చునేందుకు రూ.2లక్షల విలువైన ఫర్నిచర్ అందించారు. స్వచ్ఛమైన తాగునీటి కోసం వాటర్ ఫిల్టర్ సమకూర్చారు. పిల్లలను ఆటల్లో తీర్చిదిద్దేందుకు రిటైర్డ్ పీఈటీ నెలకుర్తి వీరారెడ్డి ఐదేళ్లగా వాలీబాల్‌లో ఉచితంగా మెళకువలు నేర్పిస్తున్నారు. దీంతో పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఇప్పుడు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు.
ఏగోడపై చూసినా పాఠ్యాంశాలే..
పాఠశాల తరగతి గదులకు ఎక్కడ చూసినా సైన్స్, మాథ్య్స్ సంబంధిత అంశాలతో కూడిన ఆంగ్ల పదాలు, స్వాతంత్య్ర సమారయోధుల జీవిత విశేషాలు, జాతీయ చిహ్నాలు కనిపిస్తాయి. తరగతి గది లోపల బయట గోడలపై ఎక్కడ చూసినా సృజనాత్మకను తట్టిలేపే పాఠ్యాంశాలే దర్శనమిస్తాయి. ఆటలు, పాటలతో పాటు యోగా చేయిస్తూ విన్నూత పద్ధతిలో ఆంగ్ల బోధన చేస్తున్నారు. విద్యార్థులు ఇంగ్లిష్‌లోనే మాట్లాడేందుకు సాయంత్రం ఉపన్యాసాలు సైతం ఇప్పిస్తున్నారు.
పేదలపై ఆర్థిక భారం తగ్గుతుంది
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం చేపట్టడం సంతోషకరం. వచే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించడం ద్వారా పేదలకు ఆర్థిక భారం తగ్గుతుంది. ప్రభుత్వ పాఠశాలలు మెరుగై కార్పొరేట్‌కు దీటుగా మారుతాయి.
-ఎర్ర పూర్ణచందర్, పీఆర్టీయూ మండలాధ్యక్షుడు
ఖర్చు లేకుండా కార్పొరేట్ విద్య
రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ఇప్పటికే సర్కారు పాఠశాలు ప్రైవేట్‌కు దీటుగా మారాయి. ఇంగ్లిష్ మీడియం బోధనతో కార్పొరేట్ స్థాయి విద్య అందుతుంది. సర్కారు బడులో ఇంగ్లిష్ మీడియం ప్రారంభమైతే విద్యార్థుల తల్లిదండ్రులకు ఖర్చు ఉండదు. ఇక సర్కారు పాఠశాలలకు మంచి రోజులు వచ్చినట్లే. ఇంగ్లిష్ మీడియం ప్రవేశంతో విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుంది.
-బిట్ల వేణుకుమార్, హెచ్ఎం జయపురం పాఠశాల
చాలా మంచి ఆలోచన
మన ఊరు-మనబడి కార్యక్రమం చాలా మంచి ఆలోచన. గ్రామీణ ప్రాంతల్లో పేదలు ఆర్థిక స్తోమత లేక తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించలేకపోతున్నారు. మధ్యతరగతివారు తమ సంపాదనంతా ప్రైవేట్ పాఠశాలలకు ధారపోస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పేదల కష్టాలు, కన్నీ ళ్లను తుడిచి, భావితరాలకు మంచి భవిష్యత్ అందించాలని సీఎం కేసీఆర్ చర్యలు చేపడుతున్నారు. ‘మన ఊరు- మనబడి’ కార్యక్రమం పేద విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుంది. ఇది దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది.
-రావుల శ్రీను, ఎస్ఎంసీ చైర్మన్, జయపురం