వరంగల్ చౌరస్తా, జూన్ 13: తక్కువ ధరకే షో రూం వాహనాలను అందిస్తామని నమ్మబలికి మోసం చేసిన వ్యక్తిని మట్టివాడ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం మట్టెవాడ సీఐ తుమ్మ గోపి తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తవాడలో నివాసముంటున్న చిట్ల సందీప్ (30) కంపెనీ ఆఫర్ పెట్టిందని, దళిత బంధును పోలిన ప్రభుత్వ స్కీం ద్వారా కొనుగోలు చేసిన వాహనాలను కేవలం 70వేల ధర పోరూం నుండి అమ్మకాలు జరుపుతున్నామని నమ్మబలికి పది మందిని మోసం చేశాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచనతో నమ్మిన వారిని మోసం చేయడం ప్రారంభించాడు.
తాను ద్విచక్రవాహనం కొనుగోలు చేస్తున్నానని, తనకు సాక్షి సంతకం చేయడానికి ఆధార్ కార్డు, పాన్ కార్డులు కావాలని అడిగి తీసుకొని వారి పేరుతో ప్రైవేట్ బ్యాంకులు, సంస్థల నుండి తక్కువ డౌన్ పేమెంట్లో ద్విచక్ర వాహనాలను లోన్ ద్వారా కొనుగోలు చేసి, వాటిని బాధితులకు 70వేలకు ఒక వాహనం చొప్పున అమ్మకాలు జరిపాడు. స్కీం కాలపరిమితి తక్కువగా ఉండడం మూలంగా వాటిని ఇతరుల పేరుతో రిజిస్ట్రేషన్ చేశాడు. మూడు నెలల తరువాత రిజిస్ట్రేషన్ మీ పేరుతో చేయించుకోవచ్చువని నన్నుబలికి బాధితులను మోసం చేశాడు.
తీరా మూడు నెలల తరువాత లోన్ ఇచ్చిన సంస్థల ప్రతినిధులు లోన్ డబ్బులు కట్టాలని ఆధార్ కార్డు, పాన్ కార్డులు ఇచ్చిన వారికి నోటీసులు పంపడంతో అసలు విషయం బయటపడింది. బాధితులు స్థానిక మట్టెవాడ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీన చేసున్నారు. కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరచిన మట్టెవాడ పోలీసులను సీపీ సన్ ప్రీత్ సింగ్ అభినందించారు.