మహబూబాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లలోనే ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, నిరుద్యోగులను ముప్పుతిప్పలు పెడుతున్నదని మాజీ ఎంపీ మాలోత్ కవిత అన్నారు. కాంగ్రెస్ పాలన తీరుతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని అన్నారు. ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట పేరుతో జిల్లా కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో మాజీ ఎంపీ మాలోత్ కవితతోపాటు మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీ కవిత మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణ అవలంబిస్తున్నదన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కేవలం రాష్ట్రంలోనే ఉద్యోగులకు సంబంధించి ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, కాంగ్రెస్ అసమర్ధపాలనకు ఇదే నిదర్శమని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ గ్రాట్యూటీ, పింఛన్ వంటివి చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్రను గుర్తించిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి అండగా నిలిచి, దేశంలో ఎక్కడా లేనివిధంగా వేతనాలు చెల్లించినట్లు తెలిపారు. దేవుడి లాంటి కేసీఆర్‌ను వదులుకున్నామని ఉద్యోగులు, నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు బాధపడుతున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ మోసపూరిత హామీలు నమ్మి ఓటు వేసిన ప్రజలకు మూడేళ్లలోనే రేవంత్‌రెడ్డి చుక్కలు చూపిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌లో మంత్రి పదవుల పంచాయతీ, పీసీసీ గొడవల గురించి తప్ప ఉద్యోగుల బాధలను పట్టించుకొనే వారే లేరని అన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు బీఆర్ఎస్ వారికి అండగా ఉంటుందని తెలిపారు. మానుకోట రాళ్ల సాక్షిగా ప్రారంభమైన ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ సూచన మేరకు తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టి ఉద్యోగుల హకులు సాధిస్తామన్నారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకుల గారడీ మాటలు నమ్మి ఇప్పుడు ఉద్యోగులు గోస పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి అన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని, ఒకటో తేదీన జీతాలిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్.., కేవలం రెగ్యూలర్ ఉద్యోగులకే చెల్లించి, 5 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం నెలల తరబడి ఇవ్వడం లేదన్నారు.
ఉద్యోగులు ప్రభుత్వానికి ఊడిగం చేయడానికి కాదని, రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలుతోపాటు 317 జీవో రద్దు చేస్తామని ఉద్యోగులకు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, పద్ధతి మార్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిప ల్ మాజీ చైర్మన్ పాల్వాయ్ రాంమోహన్‌రెడ్డి, సీనియర్ నాయకులు పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, యూత్ నాయకులు యార్ల మురళీధర్‌రెడ్డి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఈశ్వర్ కుమార్, తెలంగాణ పెన్షన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, భద్రీనారాయణ, గోవర్ధన్, డీవైఎఫ్ రాష్ట్ర నాయకుడు వివేక్ పాల్గొన్నారు.