ఐనవోలు, ఫిబ్రవరి 19: ఐనవోలులో మల్లన్నకు వైభవంగా రథోత్సవం నిర్వహించారు. ఆలయంలో మహా శివరాత్రి, మల్లికార్జున కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామి అమ్మవార్ల కల్యాణ మహోత్సవం నేత్రపర్వంగా సాగింది. అనంతరం ఆదివారం రాత్రి మల్లికార్జునస్వామి బ్రమరాంబికా దేవి సమేత శోభాయాత్ర కనులపండువగా నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల్లో వేద పండితుల మంత్రోచ్ఛారణలతో ఊరేగింపుగా రథోత్సవం కా ర్యక్రమం చూడముచ్చటగా సాగింది.
ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన కోలాటం గ్రామస్తులను ఆకట్టుకుంది. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. రథోత్సవంలో ఊరేగింపుగా వస్తున్న స్వామి వారికి మహిళలు కొబ్బరి కాయలు, మంగళహారతులతో నీరాజనం పలికారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, ఎంపీపీ మార్నేని మధుమతి, ఈవో నాగేశ్వర్రావు, ఉప ప్రధాన అర్చకులు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు ఐనవోలు మధుకర్శర్మ, పాతర్లపాటి శ్రీనివాస్, వేదపండితులు పురుషోత్తమ్మ శర్మ, విక్రాంత్ వినాయక్ జ్యోషి, అర్చకులు మధుశర్మ, శ్రీనివాస్ శర్మ, నరేశ్ శర్మ, భానుప్రసాద్ శర్మ, సాయిశర్మ, ఆలయ సిబ్బంది మధుకర్, శ్రీకాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు.