విత్తన వరి సాగు సిరులు కురిపించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన విత్తన కొరతతో ప్రైవేట్ కంపెనీలు ఈ సారి రైతులతో పెద్ద ఎత్తున సాగు చేయించేందుకు పోటీపడ్డాయి. దీంతో రికార్డు స్థాయిలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సుమారు 2 లక్షల ఎకరాల్లో ఆడమగ వరిని నాటారు. విత్తన వరి రాజధానిగా హుజూరాబాద్ వెలుగొందుతుండగా, పక్కన ఉన్న ఎల్కతుర్తి మండలంలో 8 వేలు, కమలాపూర్‌లో 10 వేల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. వాతావరణం కూడా అనుకూలించడంతో పంట ఏపుగానే పెరుగుతున్నది. ఈసారి పెట్టుబడి పోను రూ.80 వేల నుంచి లక్ష వరకు ఆదాయం లభించనుందనే అశాభావం అన్నదాతల్లో వ్యక్తమవుతున్నది.
– హనుమకొండ సబర్బన్, ఫిబ్రవరి15
ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున విత్తన వరి పండించిన రైతులు ఆర్గనైజర్ల మోసాల వల్ల చాలా మంది సాగుకు దూరమయ్యారు. తెలంగాణ రావడంతో ధాన్యాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున కొని రైతు బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయడంతో వారు సాధారణ వరి రకాల సాగు వైపు దృష్టి సారించారు. దీంతో ఆయా విత్తన కంపెనీలు ఇతర ప్రాంతాల వైపు మళ్లాయి. కొత్త ప్రాంతాల్లో విత్తన వరి సాగు చేసేందుకు ప్రయత్నించగా ప్రతికూల వాతావరణం వల్ల బెడిసి కొట్టింది. దీనికి తోడు అన్ని విత్తన కంపెనీల వద్ద విత్తన నిల్వలు పూర్తిగా తరిగిపోయాయి. దీంతో ఆయా కంపెనీలకు దేశీయ, విదేశీ అవసరాల కోసం పెద్ద ఎత్తున విత్తనాలు కావాల్సి వచ్చింది. తప్పని పరిస్థి తుల్లో ఆయా కంపెనీలు ఉత్తర తెలంగాణ వైపు రాక తప్పలేదు. అయితే గత అనుభవాల దృష్ట్యా సాగు విషయంలో రైతులు విముఖత చూపినా కంపెనీలు వారిని ప్రసన్నం చేసుకుని విజయం సాధించాయి. దీంతో దేశవ్యాప్తంగా గతంలో సగటున 1.5 లక్షల ఎకరాల్లో సాగయిన మేల్ ఫిమేల్ వరి సాగు ఈ సారి 3 లక్షల ఎకరాలకు పెరగం విషేశం. అందులో ఉత్తర తెలంగాణలోనే 2 లక్షల ఎకరాల్లో విత్తన వరి సాగయ్యింది. దీనికి ప్రభుత్వం ఇస్తానన్న సన్నవడ్ల బోనస్ మెజా రిటీ రైతులకు ఎగ్గొట్టడం కూడా కారణంగా నిలిచిందని చెప్పవచ్చు.
రైతులను ఆకర్శించేలా కంపెనీల ఆఫర్లు
పంట పండకుంటే రూ.70 వేల నుంచి 90 వేల వరకు పరిహారం ఇచ్చేలా రైతులకు కంపెనీలు ముం దుగానే బాండ్ రాసిచ్చాయి. వరి గొలుసులు మొత్తం ఒకేసారి బయటకు వచ్చేలా వినియో గించే జిబ్రాలిక్ ఆసిడ్(జియే-3) మందును కూడా ఉచితంగా ఇవ్వడంతో పాటు కోత ఖర్చులను కూడా కంపెనీలే భరిస్తాయి. ఇక గతానికంటే వడ్లకు కూడా కిలోకు రూ. 50 వరకు ధరను పెంచాయి. ఆయకం పెనీలను బట్టి రూ.12 వేలు మొదలుకుని 16 వేల వరకు ధర ఇస్తున్నాయి. అంటే దాదాపుగా పెట్టుబడి పోను రైతులకు రూ.80 వేల నుంచి లక్ష వరకు లా భం రావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాతావరణం కూడా ఇప్పటికైతే అనుకూలంగానే కనిపిస్తున్నట్లుగా చెబుతున్నారు. మన రైతులు పండించిన వరి విత్తనం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్‌తో పాటు బంగ్లాదేశ్, చైనా, పిలిప్పీన్స్, వియత్నాం లాంటి ఇతర దేశాలకు కూడా సరఫరా కావడం విషేశం.
46 ఎకరాల్లో విత్తన వరిని వేశా
నాకు గ్రామంలో 36 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకుని 46 ఎకరాల్లో ఆడమగ వరి సాగు చేస్తున్నా. ఈసారి పలు రకాల కంపెనీలు రైతులను ప్రోత్సహిస్తున్నాయి. నేను మూడు రకాల వెరైటీలు సాగు చేస్తున్నా. కొంచెం రిస్క్ ఉన్నప్పటికీ మంచి లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. పాలినేషన్ ప్రక్రియ చేపట్టేందుకు కూలీలను ముందుగానే ఎంగేజ్ చేసుకున్నా.
– గుజ్జ శ్యాంసుందర్‌రావు, రైతు, గోపాల్పూర్, హనుమకొండ జిల్లా
రైతులకు మంచి లాభాలు వచ్చే అవకాశం
ఈసారి అన్ని కంపెనీలకు విత్తనం పెద్ద ఎత్తున అవసరం పడింది. అందుకే ఆడమగ వరిని సాగు చేయించేందుకు పోటీ పడ్డాయి. ప్రస్తుతం అన్ని చోట్లా వరి నార్లు ముగిసి కలుపు దశలో ఉన్నాయి. ఇప్పటివరకైతే వాతావరణం అనుకూలంగా ఉండి పంట ఏపుగానే పెరుగుతున్నది. ఇలానే ఉన్నట్లయితే రైతులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది.
– పామెర సుమన్‌రావు, కావేరి విత్తన కంపెనీ ప్రతినిధి
ఇప్పటి వరకైతే బాగానే ఉంది
నేను పదేండ్ల కిందటి వరకు ఆడమగ వరిని పండించిన. తర్వాత లాభం ఎక్కువ లేదని మా పిలగాండ్లు వద్దంటే ఊకున్న. ఈ యాసంగిల మాత్రం కంపెనోళ్లు అచ్చి అన్ని మేమే సూసుకుంటమన్నరు. ఈసారి ఆరెకరాలల్ల ఆడమగ వరి పెట్టిన. పండినంక క్వింటాకు రూ. 14 వేలు ఇత్తనన్నరు. మా తెలిసిన సారే ఇత్తనం ఇచ్చిండు. వరి సుత మంచిగనే వత్తాంది.
– గూడెపు సమ్మయ్య, రైతు, ఎల్కతుర్తి