నర్సంపేట, అక్టోబర్ 12 : మక్క రైతుకు ప్రభుత్వ మద్దతు దక్కడం లేదు. ప్రకృతి వైపరీత్యాలు.. యూరియా కొరతతో అంతంత మాత్రంగానే దిగుబడి రాగా, పండిన పంటను విక్రయించేందుకు మార్కెట్‌కు వెళితే ప్రైవేటు వ్యాపారులు, మధ్య దళారులు దోచుకుంటున్నారు. తేమ శాతం పేరిట కొర్రీలు పెడుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మద్దతు ధరకంటే రూ. 500 వరకు తక్కువకు కొనుగోలు చేస్తూ అన్నదాతను దోపిడీ చేస్తున్నారు. ఇప్పటికే పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేని రైతులను ఆర్థిక నష్టాల్లోకి నెడుతున్నారు.
మార్కెట్లో రోజు రోజుకు పడిపోతున్న ధరలతో మక్క రైతులు ఆగవుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన మక్కజొన్నలకు ప్రభుత్వ మద్దతు దక్కక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్ర, గుజరాత్‌కు మక్కల ఎగుమతులున్నప్పటికీ వ్యాపారులు ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. క్వింటాకు రూ. 2 వేలకు మించి రేటు పెట్టడం లేదు. మక్కల కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించకపోవడంతో ప్రైవేటు వ్యాపారులది ఆడింది ఆట.. పాడింది పాటగా సాగుతున్నది. మక్కలను మార్కెట్లో రోజుల తరబడి ఆరబెట్టిన రైతులు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో నష్టమైనా అమ్ముకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మక్కజొన్నను పండించడమే శాపంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మక్కజొన్నకు మద్దతు ధర రూ. 2,400 ప్రకటించినప్పటికీ వ్యాపారులు, మధ్య దళారులు సిండికేట్‌గా మారి ఒక్కో క్వింటాకు రూ. 400 నుంచి రూ. 500 వరకు ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో అనేక కష్టాలకోర్చి పంట పండించిన రైతులు నష్టాన్ని చవిచూస్తున్నారు. ప్రభుత్వ కొనుగోళ్లు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు ప్రైవేటును ఆశ్రయించాల్సి వస్తున్నది. దీనిని ఆసరాగా చేసుకుంటున్న వ్యాపారులు రోజు రోజుకు ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు.
దీనికి తోడు 14-15 శాతం తేమ ఉన్న మక్కలను మాత్రమే అంతంత ధర పెట్టి కొనుగోలు చేస్తున్నారు. తేమ ఎక్కువగా ఉన్న వాటిని పట్టించుకోవడం లేదు. దీంతో రైతులు పంట పొలాలు, స్థానిక కళ్లాలు, మార్కెట్లో ఆరబోసి తేమ వచ్చిన తర్వాతనే విక్రయిస్తున్నారు. సరైన తేమ ఉన్నప్పటికీ వివిధ రకాల కారణాలు చూపుతూ రైతును ప్రైవేటు వ్యాపారులు నిలువునా ముంచుతున్నారు. రైతులు రోజుల తరబడి నిద్రాహారాలు మాని వారం, పది రోజులు మార్కెట్ యార్డులోనే మక్కల రాశుల వద్దే కాపలా కాస్తున్నారు.
యూరియా కొరతతో మక్కజొన్న పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. మరోవైపు అకాల వర్షాల వల్ల భారీ నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో వచ్చిన కొద్దిపాటి పంట ఉత్పత్తిని మార్కెట్లో విక్రయించేందుకు వెళితే ప్రైవేటు వ్యాపారులు, మధ్య దళారులు దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రభుత్వం మక్కలకు మద్దతు ధర రూ. 2,400 ప్రకటించినప్పటికీ, సరైన తేమ శాతం ఉన్నప్పటికీ రూ. 1,902 నుంచి రూ. 2,050 ధరతోనే ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. అష్టకష్టాలకోర్చి పండించిన పంటను తక్కువ ధరకు కొంటూ వ్యాపారులు తమను నష్టాలపాలు చేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు.
వరంగల్ జిల్లా వ్యాప్తంగా వానకాలంలో మొత్తం 15,194 ఎకరాల్లో మక్కజొన్న సాగు అయినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని నెక్కొండ మండలంలో 685 ఎకరాలు, చెన్నారావుపేటలో 610, దుగ్గొండిలో 1,750, నల్లబెల్లిలో 4,500, నర్సంపేటలో 1,900, ఖానాపూర్‌లో 2,195, గీసుగొండలో 1,028, ఖిలావరంగల్‌లో 350, పర్వతగిరిలో 262, రాయపర్తిలో 216, సంగెంలో 1,300, వరంగల్‌లో 198, వర్ధన్నపేటలో 200 ఎకరాల్లో మక్కజొన్న సాగవుతున్నట్లు పేర్కొన్నారు.