హనుమకొండ, ఏప్రిల్ 11: ‘తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్వహించిన అన్ని సభలు, సమావేశాలు విజయవంతమయ్యాయి. ఇందులో వరంగల్, కరీంనగర్ జిల్లాలు ముఖ్య భూమిక పోషించాయి. వరంగల్‌లో జరిగిన సింహగర్జన సభను మాజీ ప్రధాని దేవగౌడ చూసి.. తాను చాలా సభలు చూశానని, కానీ ఇలాంటిది ఎప్పుడూ చూడలేదన్నారు. ఇక్కడి ప్రజల చైతన్యం గొప్పది’ అని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు.
శుక్రవారం బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా కార్యాలయంలో అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి రజతోత్సవ సభ ఏర్పాట్లపై ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏప్రిల్ 27వ తేదీన ఎల్కతుర్తిలో నిర్వహించనున్న రజతోత్సవ మహాసభ చరిత్రాత్మకమని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తొలినాళ్లలో పట్టుమని 10 సీట్లు కూడా గెలువదని అవహేళన చేశారని, ఈ సందర్భంలో కేసీఆర్ చావడమో.. తెలంగాణ రావడమో అని పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించారన్నారు. పదేళ్ల పాలనలో దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసేలా చూపించిన పాలనా దక్షుడు కేసీఆర్ అన్నారు.
రజతోత్సవ సభకు స్టేషన్ ఘన్పూర్ నుంచి పాదయాత్రలో ప్రజలు రానున్నారని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపునేని నరేందర్, వొడితల సతీశ్ బాబు, మాజీ చైర్మన్ వాసుదేవారెడ్డి, నాయకులు సాంబారి సమ్మారావు, సదానందం, యాదగిరి, పులి రజినీకాంత్, ఎల్లావుల లలితా యాదవ్, రాకేశ్‌రెడ్డి, శోభన్‌కుమార్, వీరేందర్, జోరిక రమేశ్, రామ్మూర్తి, రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.
మళ్లీ కేసీఆర్ పాలననే ప్రజలు కోరుకుంటున్నారు. రజతోత్సవ మహా సభ నిర్వహణకు ఎప్పటికప్పుడు కేసీఆర్, కేటీఆర్‌లు దిశానిర్దేశం చేస్తున్నారు. 1200 ఎకరాల భూమిని సభ కోసం రైతులను మాజీ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ ఒప్పించారు. పార్కింగ్ స్థలం వద్ద రైతు మొగిలి తన పంట పూర్తికాకున్నా 20 గుంటల భూమిని సాఫ్ చేసుకొంటానని ముందుకు వచ్చారు. రైతులు, పార్టీ శ్రేణులు సభ కోసం ఎదురుచూస్తున్నారు. వేలాది వాహనాల్లో లక్షలాది మంది సభకు రానున్నారు. ట్రాఫిక్‌కు ఎక్కడా అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజలపై ఉంది.
25 ఏండ్ల నవ యవ్వన పార్టీ బీఆర్ఎస్. త్యాగాల పునాదులపై కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించాడు. సకల జనులను ఒక్కతాటిపై తెచ్చి తెలంగాణ సాధించాడు. పదేండ్లలో ప్రజలు మెచ్చిన పాలన చేశాడు. దేశంలోనే రాష్ర్టాన్ని నంబర్ వన్‌గా నిలిపాడు. నిలిపారు. ఈ నెల 27న ఎలతుర్తిలో రజతోత్సవ సభను నిర్వహిస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌బాబు, రైతులు స్వచ్ఛందంగా సభ నిర్వహణ కోసం భూములు ఇచ్చినందుకు ధన్యవాదాలు. సభకు తరలివచ్చే వారి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.