ములుగురూరల్, మే 12 : విదేశీ విత్తనోత్పత్తి కంపెనీల ద్వారా నష్టపోయిన వెంకటాపురం (నూగూరు), వాజేడు మండలాలకు చెందిన మక్కజొన్న రైతులు పరిహారం ఇప్పించాలని సోమవారం ములుగు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందజేశారు. రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్న ఆదివాసీ నవ నిర్మాణ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు కొర్స నర్సింహమూర్తి మాట్లాడుతూ రెండు మండలాల్లో సుమారు 900 మంది రైతులు మక్కజొన్న పంట ద్వారా తీవ్ర నష్టాన్ని చవిచూశారని అన్నారు.
ఆయా కంపెనీల విత్తనాల ద్వారా పంట దిగుబడి రాక రైతులు అప్పుల్లో కూరుకుపోయారని అన్నారు. ఎకరానికి రైతుకు రూ. లక్షా 50 వేల చొప్పున నష్టపరిహారం కంపెనీల ద్వారా అందించాలని అన్నారు. పంట నష్టంతో మృతి చెందిన, అనారోగ్యం బారిన పడ్డ రైతులకు ఎక్స్గ్రేషియా కింద విత్తన కంపెనీల నుండి కానీ, ప్రభుత్వం నుండి కానీ రూ.10 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
నకిలీ విత్తనాలపై ఏసీబీతో సమగ్ర విచారణ జరిపించి రైతులకు భవిష్యత్లో అన్యాయం జరగకుండా చూడాలన్నారు. స్థానికులైన గూడ నర్సింహమూర్తి, మన్యం సురేశ్, ధనవనేని నాగరాజు, తన్నీరు రాంబాబు విత్తన కంపెనీలకు సూపర్వైజర్లుగా పనిచేసి రైతులను నట్టేట ముంచారని, వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు మోసాలకు పాల్పడిన ఆర్గనైజర్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.