మహబూబాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : ఏప్రిల్, మే నెలలు రాక ముందే ఎండలు దంచి కొడుతున్నాయి. భానుడు భగభగ మండుతున్నాడు. ఉదయం ఎనిమిది దాటక ముందే సూర్యుడు నిప్పులు కురిపిస్తుండడంతో జనం బయటికి రావడానికి జంకుతున్నారు. వారం రోజుల క్రితం వరకు మామూలుగానే ఉన్న ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో జనం తట్టుకోలేకపోతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నాలుగు రోజుల క్రితం వరకు 36 నుంచి 37 డిగ్రీలున్న ఉష్ణోగ్రత 41 డిగ్రీలకు చేరడంతో మధ్యాహ్నం పూట రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.
ఎండ తీవ్రతకు జనం బయటికి వెళ్లడం లేదు. ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని నెహ్రూసెంటర్, ఇందిరాగాంధీ సెంటర్, ముత్యాలమ్మ గుడి సెంటర్, మార్కెట్ రోడ్, మదర్ థెరిసా సెంటర్, వైఎస్సార్ సెంటర్ తదితర ప్రాంతాల్లో ప్రధాన రహదారులన్నీ మధ్యాహ్నం బోసిపోయి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కనిష్ఠ ఉష్ణోగ్రత 23 డిగ్రీలు కాగా, గరిష్ఠ ఉష్ణోగ్రత 41డిగ్రీలకు చేరింది. ఎండలో బయటకు వచ్చే ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.