హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 19 : మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలను కాజీపేట నుంచి తరలించొద్దని, ఇక్కడే వసతులు కల్పిం చి కొనసాగించాలని విద్యార్థులు కోరుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ములు గు, మహబూబాబాద్ జిల్లా కేంద్రాల్లో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేశారు.అడ్మిషన్లు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో వాటిని కాజీపేటలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ ఐదేళ్ల లా కోర్సు నడుస్తున్న భవనంలోకి మార్చారు.
66 మంది మహిళా విద్యార్థినులు లా చదువుతున్నారు. జూలై 2024 నుంచి అరకొర వసతులతోనే డిగ్రీ కాలేజీలను ఇందులో కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం బీఏ, బీకాం సీఏ, ఎంపీసీఎస్, ఎంఎస్డీఎస్, బీఎస్సీ, బీజెడ్సీ కోర్సుల్లో సుమారు 230 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. పది మంది రెగ్యులర్ లెక్చరర్లు ఉండగా ఆరుగురు గెస్ట్ ఫ్యాకల్టీ విద్యా బోధన చేస్తున్నారు. స్పెషల్ ఆఫీసర్గా విశ్రాంత అధ్యాపకుడు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో లా, డిగ్రీ విద్యార్థులు కలిసి పెద్ద సంఖ్యంలో ఉండడంతో గదులు సరిపోకపోవడం, మౌలిక సదుపాయాలు లేక చాలా సార్లు నిరసన వ్యక్తం చేశారు. డిగ్రీ కాలేజీ ఇందులో ఉండకూడదని, ఇక్కడి నుంచి వెళ్లిపోండని లా కళాశాల విద్యార్థినులు ఇబ్బందులు పెడుతున్నారని వాపోతున్నారు.
ఈనెల 20వ తేదీ వరకు ములుగు, మహబూబాబాద్ బీసీ మహిళా డిగ్రీ కాలేజీల్లోని విద్యార్థినులను జనగామ జిల్లా పెంబర్తిలో ఉన్న మహాత్మాజ్యోతిబాపూలే బీసీ మహిళా డిగ్రీ గురుకుల కాలేజీకి మార్చాలని బీసీ గురుకులాల వెల్ఫేర్ రాష్ట్ర కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. దీంతో విద్యార్థినులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రాంతంలో ఉందని ప్రవేశాలు పొందామని, ఇప్పుడు మళ్లీ తమను పెంబర్తి మహిళా గురుకుల కళాశాలకు తరలిస్తే దూరమవుతుందని వాపోతున్నారు. ఇక్కడి నుంచి వెళ్లేలేది లేదని విద్యార్థినులు, తల్లిదండ్రులు ససేమిరా అంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థినుల జీవితాలను ఆగమాగం చేస్తున్నదని విద్యార్థి సంఘాల నాయకులు సైతం మండిపడుతున్నారు.