కల్హేర్, జూన్ 13: సాగు భూములకు పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని మహదేవుపల్లి రైతులు కోరారు. వివరాల్లోకి వెళ్తే.. కల్హేర్ మండలం మహదేవుపల్లి గ్రామ శివారులోని 131, 135, 142, 170 సర్వే నంబర్లలో అసైన్డ్ భూముల్లో బోర్లు వేసుకొని గత కొన్ని సంవత్సరాలుగా పంటలను పండించుకొని జీవన ఉపాధి పొందుతున్నామని గ్రామానికి చెందిన రైతులు తెలిపారు. అయితే కల్హేర్ మండలం మాసాన్ పల్లి గ్రామానికి చెందిన 70 మంది రైతులకు ఆ భూములపై పట్టాలను ఇచ్చారన్నారు. వారికిచ్చిన పట్టాలను రద్దుచేసి పంటలు సాగు చేసుకుంటున్న రైతులకు ఇవ్వాలని పలుమార్లు అధికారులకు దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు.
ఇప్పటివరకు వారి పేర్లను తొలగించి మా పేరున పట్టాలను ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో తీసుకొచ్చిన భూభారతిలో వారి పేర్లను తొలగించి గత కొన్ని సంవత్సరాలుగా పంటలను సాగు చేసుకుని జీవనోపాధి పొందుతున్న తమకు పట్టాలు ఇచ్చి న్యాయం చేయాలని రైతులు రెవెన్యూ సదస్సుకు వచ్చిన అధికారికి వినతి పత్రం అందజేశారు.