తొర్రూరు, జూన్ 2: కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ వచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ శిబిరంలో గురువారం లయన్స్ భవన్లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని కేక్‌కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 1969 నుంచి తెలంగాణ సాధన కోసం పోరాటాలు జరుగగా నాడు చెన్నారెడ్డి వంటి నాయకులను కాంగ్రెస్ తమ వైపునకు తీప్పుకుని ఉద్యమాలను నీరుగార్చిందని, కానీ, కేసీఆర్ మాత్రం మలివిడుత ఉద్యమం శాంతియుతంగా నిర్వహించి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించినట్లు తెలిపారు. పట్టుదలతో పోరాటం అంటే కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలని, ఆయన స్ఫూర్తితోనే కష్టపడి చదివి కొలువులు సాధించాలని సూచించారు.
నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఆవిర్భావించిన తెలంగాణలో అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేరుస్తున్న సీఎం కేసీఆర్‌ను మనం ఆదరించాలని, విద్యావంతులైన మీరంతా జరుగుతున్న అభివృద్ధిని గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమేశ్, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, సీడబ్ల్యూసీ చైర్మన్ డాక్టర్ ఎస్ నాగవాణి, డాక్టర్ పీ సోమేశ్వర్రావు, వైస్ చైర్మన్ జినుగ సురేందర్‌రెడ్డి, రామిని శ్రీనివాస్, కుర్ర శ్రీనివాస్, ఎండీ జలీల్, జైసింగ్, కోచింగ్ సెంటర్ ఇన్చార్జి పంజా కల్పన, జయశంకర్ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు నర్సింహాచారి, శ్రీనివాస్, ఎర్రం రాజు పాల్గొన్నారు.
కేంద్రం కక్షసాధింపు చర్యలను ఎండగట్టాలి
కేంద్రప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మానుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నుంచి నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి హరీశ్‌రావుకు ఎప్పటికప్పుడు వివరాలు సమర్పిస్తూ పంచాయతీలకు రావాల్సిన నిధులను విడుదల చేయిస్తున్నామని, ఈజీఎస్‌లో రాష్ట్ర వాటా రూ.165 కోట్లు విడుదల చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం రూ.1400 కోట్ల నిధులను పెండింగ్‌లో పెట్టిందని, ఏదో ఒక కారణం చూపుతూ రోజులు గడుపుతున్నారని అన్నారు. ఇందులో రూ.900కోట్ల మేర పనులు ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన సీసీ రోడ్ల పనులు సర్పంచులతో చేయించడం జరిగిందని, మిగిలినవి వైకుంఠధామాలు, ఇతర నిర్మాణాలకు నిధులను కేంద్రం నుంచి విడుదల చేయించాల్సి ఉందన్నారు.
అన్ని వివరాలను మరోసారి కేంద్ర అధికారుల బృందానికి సమర్పించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ అధికారులు ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమయ్యారని అన్నారు. సర్పంచులకు ఈ తరహా నిధులు ఇస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమేనని, వారికి అన్ని అధికారులు ఇచ్చి చివరికి ఉప సర్పంచ్ చెక్‌పవర్ విషయంలో కూడా ఇబ్బందులు లేకుండా నిబంధనలు సవరించామన్నా రు. అయినా, కొందరు కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని అన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో కేటీఆర్ హైదరాబాద్ నుంచి, ఎర్రబెల్లి పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు నుంచి పాల్గొనగా ఇంకా మంత్రులు, ఎంపీలు, తదతరులు వివిధ ప్రాంతాల నుంచి పాల్గొన్నారు.