మహబూబాబాద్ రూరల్, మే 10 : ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాబునాయక్‌తండా వద్ద రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.550 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల పనులకు, రూ.37.5కోట్లతో 250 పడకల దవాఖాన భవన నిర్మాణ పనులకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే ఏరియా హాస్పిటల్లో రూ.70లక్షలతో రేడియాలజీ సర్వీస్ రెండో అంతస్తు భవనానికి శంకుస్థాపన చేసి రూ. 7.2 కోట్ల తో ఏరియా హాస్పిటల్ అదనపు అంతస్తును, రూ.54లక్షలతో 41 పడకల జనరల్ వార్డును, రూ. 32 లక్షలతో నిర్మించిన పిల్లల సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు.
జిల్లాలో వైద్య సదుపాయాల అభివృద్ధి కోసం రూ.8.6 కోట్ల నిధులను మంత్రి మంజూరు చేశారు. అర్బన్ ఆరోగ్య కేంద్ర భవనానికి రూ.2.2 కోట్లు, అయోధ్యపురం పీహెచ్‌సీకి నిర్మాణానికి 2.2 కోట్లు, సబ్ సెంటర్ల నిర్మాణానికి రూ.20లక్షలు చొప్పున మంత్రి మంజూరు చేశారు. అనంతరం మంత్రి హరీశ్ మాట్లాడుతూ ఉద్యమస్ఫూర్తితో ఏర్పడిన తెలంగాణలో మానుకోటను కొత్త జిల్లాగా ఏర్పాటుచేశామని, ఇప్పుడు రూ.510 కోట్లతో వైద్య కళాశాలను కూడా మంజూరు చేసుకొని పనులకు శంకుస్థాపన చేసుకున్నామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతంలో కేవలం మూడు ప్రభుత్వ వైద్య కళాశాలలే ఉండేవని వాటిలో 700 మెడికల్ సీట్లు మాత్రమే ఉన్నాయని.. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చొరవతో 33 వైద్య కళాశాలల ఏర్పాటుకు కృషి చేసినట్లు చెప్పారు.
ప్రస్తుతం 2,840 మెడికల్ సీట్లు ఉన్నాయని, ఏడాది కాలంలో 5,420 సీట్లు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. మానుకోట జిల్లాలో భవిష్యత్తులో 650 పడకలతో 100మంది వైద్యులతో జిల్లా దవాఖాన అందుబాటులో ఉంటుందని, ప్రజలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభు త్వ దవాఖానలో అన్ని రకాల మందులు, పరీక్షా యంత్రా లు, అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంచుతున్నా మని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, బానోత్ శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్చంద్ర పవార్ తదితరులు పాల్గొన్నారు.