టోకెన్లు పంపిణీ చేసిన మేయర్
వాక్సినేషన్ కేంద్రాలను పరిశీలించిన కమిషనర్
వరంగల్, మే 28 : సూపర్ స్ప్రెడర్లకు టీకాల ఏర్పాట్లు పూర్త్తయ్యాయి. శనివారం నుంచి గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో 5 కేంద్రాల్లో సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్లు వేసేందుకు బల్దియా అధికారులు సర్వం సిద్ధం చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేతుల మీదుగా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి రోజూ 5 వేల సూపర్ స్ప్రెడర్లకు టీకాలు వేసేలా కార్యాచరణ రూపొందించారు. ప్రతి సెంటర్ పరిధిలో 13 డివిజన్లు వచ్చేలా ప్రణాళికలు చేశారు. కార్పొరేషన్ పరిధిలో ఇప్పటి వరకు 90,500 మంది సూపర్ స్ప్రెడర్లను గుర్తించారు. 20 రోజుల పాటు టీకాల కార్యక్రమం ప్రత్యేకంగా చేపట్టనున్నారు. మటన్, చికెన్, చేపలు, కూరగాయలు, పండ్లు, కిరాణ, ఐరన్, సిమెంట్, వీధి వ్యాపారులు, డెలివరీ బాయ్స్, క్షౌరశాలలో పని చేస్తున్న వారిని సూపర్ స్ప్రెడర్లుగా గుర్తిస్తున్నారు. సూపర్ స్ప్రెడర్లకు టోకెన్ల పంపిణీ ప్రక్రియను మేయర్ గుండు సుధారాణి చేతుల మీదుగా ప్రారంభించారు. వ్యాక్సినేషన్ సెంటర్లను కమిషనర్ పమేలా సత్పతి పరిశీలించారు.
సూపర్ స్ప్రెడర్లు వ్యాక్సిన్ తీసుకోవాలి..
గుర్తించిన సూపర్ స్ప్రెడర్లు టీకాల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేయర్ గుండు సుధారాణి సూ చించారు. శనివారం ఆమె కార్పొరేషన్లో సూపర్ స్ప్రెడర్లకు టోకెన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 18 ఏండ్లు నిండిన సూపర్ స్ప్రెడర్లకు టీ కాలు వేస్తున్నామన్నారు. టోకెన్‌తో పాటు ఆధార్ కార్డును వ్యాక్సినేషన్ సెంటర్‌కు తీసుకెళ్లాని సూచించారు. గ్రేటర్లో లక్ష మంది సూపర్ స్ప్రెడర్లకు టీకాలు వేసేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.
కరోనా నిబంధనలు పాటించాలి..
వ్యాక్సినేషన్ సెంటర్లో కొవిడ్ నిబంధనలు పాటించాలని గ్రేటర్ కమిషనర్ పమేల సత్పతి అధికారులను ఆదేశించారు. శంభునిపేటలోని ఆర్ఆర్ గార్డెన్, వరంగల్‌లోని ఇన్నర్‌విల్ క్లబ్, హన్మకొండలోని విష్ణుప్రియా గార్డెన్, బీమారంలోని జీఎంఆర్ గార్డెన్లో చేస్తున్న ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ప్రతి సెంటర్లో 1000 మందికి టీకాలు వేయనున్న తరుణంలో 10 టెబుల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు. ఆమెతో పాటు చీఫ్ ఎంహెచ్వో రాజారెడ్డి, డిప్యూటీ కమిషనర్లు జోనా, రవీందర్ యాదవ్, ఈఈలు శ్రీనివాస్‌రావు, ప్రవీణ్ కు మార్, సానిటరీ ఇన్స్పెక్టర్లు శ్యామ్‌రాజ్ ఉన్నారు.