నర్సింహులపేట, జూన్ 26: మందుబాబులకు ప్రభుత్వ పాఠశాలలు (Government School) అడ్డాలుగా మారుతున్నాయి. అక్కడే చదువుకున్న విషయం మరిచిపోయి.. సాయంత్రం అయిందటే చాలు పూటుగా తాగి మందు బాటిళ్లను అక్కడే వదిలేసి వెళ్తున్నారు. పాఠశాల వరండాలను తాగుబోతులకు అడ్డాగా మల్చుకోవడం పట్ల పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నర్సింహులపేట మండలంలోని కౌసల్యదేవిపల్లి ప్రాథమిక పాఠశాలలో గత కొన్ని రోజులుగా తాగుబోతులు బీరు సీసాలు తాగి పడేస్తున్నారని, సీసాలు పగుళగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల సమీపంలో బెల్టుషాపునిర్వహిస్తున్న ఈ విషయంపై ఎక్సైజ్ అధికారులకు తెలిపినా తూతూ మాత్రంగా తనిఖీలు చేసి ఏమీ చేయాలేమని వదిలేశారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
గతరాత్రి పాఠశాల వరండాలో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకున్న గుర్తుతెలియని వ్యక్తులు బీరు సీసాలు, చికెన్ తిన్న పేట్లు,
కేక్ డబ్బాలు అక్కడే వదిలేశారు. ఉదయం పాఠశాలకు వెళ్లిన విద్యార్థులకు అవి దర్శనమివ్వడంతో కంగుతిన్నారు. ఇకనైనా మందుబాబులు పాఠశాలల్లో కూర్చోని మద్యం సేవించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.