బయ్యారం, అక్టోబర్ 11: ఇంట్లో రకరకాల పూలు, పండ్లు, నీడనిచ్చే పచ్చని చెట్లుంటే ఆ ఇల్లు నందనవనాన్ని తలపిస్తుంది. వాటి మధ్య కొద్దిసేపు గడిపితే.. ఆ ప్రశాంతత, ఆ అనుభూతి మాటలకందదు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం స్ఫూర్తితో ప్రకృతి ప్రేమికులు కొందరు తమ ఇళ్లను పచ్చని పందిళ్లుగా మార్చుకున్నారు. తీరొక్క మొక్కలు నాటి, వాటిని అపురూపంగా పెంచుతున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రానికి చెందిన సంకు సత్తిరెడ్డి, ఉప్పలపాటి బాబురావు తమ ఇళ్లను రకరకాల మొక్కలతో నింపేశారు. ఇళ్ల ఆవరణల్లో నీడనిచ్చే, పండ్ల మొక్కలతోపాటు కుండీల్లో రంగురంగులు, ఇంటికి అందాన్నిచ్చే పూల మొక్కలు నాటారు. ప్రతి రోజూ వాటిని ప్రత్యేక శ్రద్ధతో సంరక్షిస్తున్నారు. పచ్చని చెట్లు, మొక్కలతో వారి ఇళ్ల ఆవరణలు ముచ్చటగొలుపుతున్నాయి. పూల మొక్కలు వెదజల్లే సువాసనలు, ప్రశాంత వాతావరణం, స్వచ్ఛమైన గాలి ఇంటిలోపలికి వెళ్లిన వారికి మధురానుభూతిని ఇస్తున్నాయి.
మొక్కల పెంపకమంటే ఇష్టం
మొక్కల పెంపకం అంటే ఎంతో ఇష్టం. హరితహారం స్ఫూర్తితో ఇంటి ఆవరణలో 200 రకాల పూలమొక్కలు, అందాన్ని ఇచ్చే మొక్కలను కుండీలో పెంచుతున్నాం. దీంతో మా ఇంటి ఆవరణ ఎప్పుడూ పచ్చదనంతో కళకళలాడుతుంది. మొక్కల పెంపంకంతో భావితరాలకు మంచి పర్యావరణం అందుతుంది.
-ఉప్పలపాటి కుసుమ (బయ్యారం )
హరితహారం స్ఫూర్తి నిచ్చింది..
హరితహారం స్ఫూర్తితోనే ఇంట్లో మొక్కలు పెంచుతున్నాం. ప్రతి రోజూ వాటికి నీళ్లు పోసి కంటికి రెప్పలా కాపాడుకుంటాం. ఇంటికి వచ్చిన వారు సైతం మొక్కలను చూసి ముగ్ధులవుతున్నారు. పిల్లలకు చిన్నతనం నుంచే మొక్కల పెంపకంపై ఆసక్తి కలిగేలా చూడాలి.
-సంకు లక్ష్మి ( బయ్యారం )