మహబూబాబాబాద్, ఏప్రిల్ 6 (నమస్తేతెలంగాణ) : రోడ్డు ప్రమాదాల బారి నుంచి వాహనదారులను రక్షించేందుకు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘నో హెల్మెట్.. నో ఎంట్రీ..’ పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ‘మీ కోసం మీ కుటుంబ సభ్యులు ఎదురుచూస్తుంటారు.. వాళ్ల కోసమైనా హెల్మెట్ పెట్టుకోండి.. సురక్షితంగా ఇంటికి చేరండి ..’ అని ఎస్పీ శబరీష్ వాహనదారులకు సూచిస్తున్నారు. 100 శాతం హెల్మెట్ వినియోగమే లక్ష్యంగా గ్రామాల స్థాయిలో అవగాహన కల్పించేందుకు నెల రోజుల నుంచి విశేషంగా కృషి చేస్తున్నారు. దీంతో ‘నో-హెల్మెట్- నో ఎంట్రీ ఫ్లెక్సీ’లు గ్రామాల్లో వెలుస్తున్నాయి.
రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా హెల్మెట్ లేకపోవడంతోనే వాహనదారులు చనిపోవడం చూస్తున్నాం. ఫలితంగా మృతుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. దీనిని గుర్తించిన ఎస్పీ శబరీష్ జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడం, ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించడం వంటివి అమలు చేయిస్తున్నారు. పోలీస్‌శాఖ ద్వారానే ఇది వందశాతం అమలవుతుందని భావించిన ఆయనకు ఓ ఆలోచన తట్టింది. అందులో భాగంగానే వార్డు స్థాయి నుంచి మండలం వరకు, మండలాల నుంచి జిల్లా వరకు దీనిని దశల వారీగా అమలు చేయాలని భావించారు.
పోలీస్, ట్రాఫిక్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, రెవెన్యూ తదితర శాఖలను భాగస్వాములను చేశారు. అంతేకాకుండా గ్రామ పంచాయతీ పరిధిలోని వార్డు మెంబర్లు, సర్పంచ్, కార్యదర్శి, వీఆర్ఏలతోపాటు మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, పాలకవర్గాలను ఇందులో భాగస్వాములను చేశారు. గ్రామ స్థాయిలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను గుర్తించడం. వాటిని పోలీసులకు సమాచారం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇందులో భాగంగా రెండు వారాల కిత్రం జిల్లాలోని సర్పంచులు, కౌన్సిలర్లతో సమావేశం ఏర్పాటు చేసి పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రస్తుతం జిల్లాలోని 18 మండలాల్లో 482 గ్రామపంచాయితీలున్నాయి. మొదటి విడుతలో భాగంగా 38 గ్రామ పంచాయతీలు, 15 వార్డుల్లో నో హెల్మెట్.. నో ఎంట్రీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా వారివారి గ్రామాల్లో బ్యానర్లు, ప్లెక్సీలు ఏర్పాటు చేసుకొని గ్రామంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టడం.. ఇందులో భాగంగా ఆయా గ్రామాలకు పోలీసులు వెళ్లినప్పుడు గ్రామస్తులతో కలిసి ద్విచక్రవాహనాలపై హెల్మెట్ ధరించి ర్యాలీలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు.
మాది మహబూబాబాద్ మండలం పర్వతగిరి. ప్రతిరోజు పనికోసం మహబూబాబాద్ పట్టణానికి వస్తాను. గతంలో ఒకసారి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు పడిపోయి గాయపడ్డాను. అప్పుడు పెద్ద ప్రమాదం తప్పింది. ఇటీవల కాలం లో పోలీసులు హెల్మెట్‌పై అవగాహన కల్పిస్తున్నారు. గతంలో తగిలిన దెబ్బతోపాటు పోలీసులు చెబుతున్న మాటలు విన్న తర్వాత హెల్మెట్ లేకుండా బండి బయటకు తీయడం లేదు.
– మేకల నరేశ్, పర్వతగిరి, మహబూబాబాద్ మండలం
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మూడు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఇందులో ముఖ్యంగా మాదక ద్రవ్యాలు వినియోగించే వారిని గుర్తించి వారితో మాన్పించడం, రోడ్డు భద్రతలో భాగంగా ప్రమాదాలను నివారించడంతో పాటు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ నష్టం జరగకుండా ప్రతి ద్విచక్రవాహనదారుడు హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పించడం, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా గ్రామాల్లో అసాంఘిక కార్యక్రమాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం. మొదటి విడతలో జిల్లాలో 38 గ్రామ పంచాయతీలు, 15 వార్డుల్లో ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.
– శబరీష్, మహబూబాబాద్ ఎస్పీ
నేను ప్రతి రోజూ కురవి నుంచి మహబూబాబాద్‌కు సుమారు 8 కిలోమీటర్ల దూరం ద్విచక్రవాహనంపై ప్రయాణం చేస్తా. పని అయిపోగానే తిరిగి కురవికి వెళ్తాను. మా సమీప గ్రామమైన తిర్మాలాపురానికి పని మీద వెళ్లాను. అదే రోజు ఆ గ్రామంలో ఎస్పీ శబరీష్ హెల్మెట్ గురించి వివరిస్తుంటే విన్నాను. హెల్మెట్ లేకుంటే జరిగే పరిణామాలపై చెప్పారు. ఆ రోజు నుంచి హెల్మెట్ వాడుతున్నా. నాలాగే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు. మన మంచికి చెబుతున్న పోలీసుల మాటలు విన్న తర్వాత నాలో ఆలోచన వచ్చింది. హెల్మెట్ పెట్టడం వల్ల లాభమే తప్ప నష్టం లేదు.
– రచ్చ అనిల్, ప్రైవేట్ ఉద్యోగి, కురవి