Kaleswaram | మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంశ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో శనివారం రెండో రోజు మహా కుంభాభిషేక మహోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వేద పండితులు ప్రాతః సూక్త మంత్ర పఠనం, ప్రాతఃకాల పూజలు, చండీ పారాయణం, సహస్ర ఘటాభిషేకం, మహా రుద్రాభిషేకం నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం 3:30 గంటల నుండి సాయంత్రం 6:30 గంటల వరకు చండీ హోమం, ప్రదోషకాల పూజలు, హారతి, మంత్రపుష్పం, చతుర్వేద సేవలను నిర్వహించారు. ఈ పూజల్లో వివిధ ప్రాంతాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పుర మండలం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలో నిర్వహించనున్న మహా కుంభాభిషేక మహోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు రానున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రానున్నట్లు తెలిసింది. ఈ మేరకు కన్నెపల్లి గ్రామంలో అధికారులు హెలిప్యాడ్ సిద్ధం చేస్తున్నారు.