మహాదేవపూర్, మే 5: అసమర్ధ పాలనను కప్పి పుచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నదని మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆధ్వర్యంలో ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలు.. వాస్తవాలు’పై చర్చావేదిక నిర్వహించారు. కార్యక్రమానికి సిరికొండతో పాటు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, సాగునీటి రంగ నిపుణులు వీరమల్ల ప్రకాశ్, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలను పటాపంచలు చేయాలనే ఆలోచనతో ఈ చర్చా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆనాడధ్ వలసవాదులు తెలంగాణకు దక్కాల్సిన నీళ్ల వాటాను తరలించుకుపోయి అన్ని రకాలుగా అభివృద్ధి చెంది మనపైనే పెత్తనం చెలాయించారన్నారు. 1956నుంచి2014వరకు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సమస్యల కాసరంగా తయారైందని, ఈ క్రమంలో తెలంగాణ సాధనే సమస్యలకు పరిష్కారమని ఉద్యమనేత కేసీఆర్ ఆలోచన చేశారన్నారు.
తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ముందుగా నీళ్ల ఉద్యమం మొదలు పెట్టారన్నారు.
కాకతీయులను ఆదర్శంగా తీసుకున్న కేసీఆర్ ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారని, నీటిని ఒడిసిపట్టే కాకతీయుల ఆలోచనలకు అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారన్నారు. పదేండ్ల పాటు కాళేశ్వరం ప్రాజెక్టుతో నీటి ప్రయోజనాలు పొందామని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేయాలనే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ సీఎంకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏజెంట్ అనే విషయం అందరికి తెలిసిందేనని, ఇద్దరి సీఎంల సమిష్టి ప్రయోజనాల కోసం ఈ ప్రాంత ప్రయోజనాలను ఆంధ్రాకు తాకట్టు పెట్టి ప్రయోజనం పొందేందుకు కుట్రలు చేస్తున్నారన్నారని ఆయన ఆరోపించారు.