వరంగల్ చౌరస్తా: కేంద్ర పాలన విధానాల మూలంగా భారదేశ సార్వభౌమత్యానికి ప్రమాదం పొంచివుందని ఎంసీపీఐ(యూ) పొలిట్ బ్యూరో సమావేశంలో అఖిలభారత ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ అన్నారు. మంగళవారం వరంగల్ హెడ్ పోస్టాఫీస్ సెంటర్లోని ఓ ప్రముఖ హోటల్లో రాజస్థాన్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ మహేందర్ నేహా అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఎంసీపీఐ(యూ) పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా పెహల్గావ్ మృతులకు, ఆపరేషన్ సింధూర్‌లో మృతి చెందిన అమర జవాన్లకు నివాళులు అర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.
అనంతరం అఖిలభారత ప్రధాన కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించడంతో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. అపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్ఐ యుద్ధం మొదలుపెట్టిన భారత్ అమెరికా జోక్యంతో ఒక్కసారిగా సీజ్ ఫైరికి అంగీకరించడం వెనక జరిగిన విషయాలను ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. శత్రుదేశంతో యుద్ధం చేస్తున్న సమయంలో సీజ్ ఫైర్ అంగీకరించి, ఆపరేషన్ కగార్ పేరుతో ఎన్కౌంటర్లు చేయడం, శవాలను సైతం కుటుంబసభ్యులకు అప్పగించకపోవడం, మావోయిస్టులతో శాంతి చర్చలకు ముందుకు రాకపోవడం హేయమైన చర్యని అని మండిపడ్డారు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపాలని ఆయన డిమాండ్ చేశారు. కార్పొరేట్ శక్తులకు దేశసంపదను దోచిపెట్టడానికి కేంద్రం పని చేస్తుందే తప్ప, ప్రజా సంక్షేమం కోసం కాదని అన్నారు. ప్రజా పోరాటాల ద్వారా కేంద్ర విధానాలను ప్రజల్లోకి తీసుకుపోవడానికి కమ్యూనిస్టులు ఏకం కావాలని అన్నారు. దేశవ్యాప్తంగా చేపట్టే ప్రజా ఉద్యమాలలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పొలిట్ బ్యూరో సభ్యులు కిరణిజిత్ సింగ్ షెకాన్, గాదగోని రవి, అనుభవా దాస్ శాస్త్రి, పల్లెపు ఉపేందర్‌రెడ్డి, కాటం నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.