వరంగల్ చౌరస్తా: ఉగ్రచర్యలను పసిగట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమయ్యిందని ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ అన్నారు. నిఘా వ్యవస్థ పూర్తిస్థాయిలో పనిచేయకపోవడం కారణంగా పెహల్గాంలో పైశాచిక ఉగ్రదాడి జరిగి 26 మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. మంగళవారం ఓంకార్ భవన్లో భారత మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ (ఐక్య) రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆయన హాజరై పెహల్గాం మృతులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ విధానాల మూలంగా నేడు దేశంలో ఇబ్బందిపడని వారు లేరని అన్నారు.
కేంద్రం అనుసరిస్తున్న విధానాల మూలంగా ఆదానీ, అంబాని లాంటి పెట్టుబడిదారులు దేశ సంపదను అనుభవిస్తున్నారని, యథేచ్ఛగా దేశ సంపదను మింగేస్తున్నారని మండిపడ్డారు. దేశ రక్షణ రంగంపై నిరంతర నిఘాను ఏర్పాటు చేయాల్సిన పాలకులు నిమయాకాలు చేపట్టకుండా భద్రతను పటిష్టం చేయకుండా పర్యాటకులను బలి చేశారని విమర్శించారు. దేశంలో ఏ విధమైన మతోన్మాదమైనా ప్రజలకు తీవ్ర నష్టాన్ని, కష్టాలను మిగిలిస్తుందని ఆన్నారు. అలాంటి పరస్థితుల్లో వామపక్ష, సామాజిక, ప్రజాసంఘాలు ప్రజలను సమీకరించి ఉద్యమాలను చేపట్టాలని ఆయన అన్నారు.
ప్రజాఉద్యమాలలో ఎంసీపీఐ(యూ) నాయకులు, కార్యకర్తలు ముందు వరుసలో ఉండాలని పిలుపునిచ్చారు. కార్మిక చట్టాల రద్దు, లేబర్ కోడ్ ల అమలుపై కేంద్రంపై నిర్వహిస్తున్న ప్రజా ఉద్యమంలో ఎంసీపీఐ(యూ) నాయకులు ముఖ్యపాత్ర పోషించాలని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, కార్యవర్గ సభ్యులు వల్లేపు ఉపేంధర్ రెడ్డి, వనం సుధాకర్, కుంభం సుకన్య, వసుకుల మట్టయ్య, వరికుప్పల వెంకన్న, గోనె కుమారస్వామి, పెద్దారపు రమేష్, ఎన్రెడ్డి హంసారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.