Chandrabose | చిట్యాల, మారి 13 : మన ఊరి వ్యక్తి.. ప్రపంచస్థాయిలో కీర్తిని పొందితే ఎంత సంతోషంగా ఉంటుందో.. అలాంటి సంతోషాన్నే చల్లగరిగెవాసులు ఇప్పుడు ఆస్వాదిస్తున్నారు. టాలీవుడ్ అగ్రదర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ (త్రిబుల్ ఆర్) సినిమాలో సినీగేయ రచయిత చంద్రబోస్ రాసిన ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై ఆయన స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం, చల్లిగరిగెలో బాల్యమిత్రులు, కళాకారులు, శిష్యులు సోమవారం సంబురాలు చేసుకున్నారు పటాకులు కాల్చి, కేక్ కట్ చేసి ఒకరినొకరు పంచుకొని హర్షం వ్యక్తం చేశారు. మారుమూల గ్రామంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగు సినిమా, తెలంగాణ కీర్తిని దేశం గర్వించేలా ప్రపంచానికి చాటిచెప్పిన చంద్రబోస్ చల్లగరిగె గ్రామస్తుడు కావడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు.
Challagarige Village
చల్లగరిగెలోని కనుకుంట్ల నర్సయ్య, మధునమ్మ దంపతుల ఆఖరి సంతానం (నాలుగోవాడు). తండ్రి ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయుడిగా రిటైర్డ్ అయ్యారు. చంద్రబోస్‌కు ఇద్దరు అన్నలు, ఒక అక్క. ఆయన స్వగ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివారు. పాఠశాలలో ప్రతిజ్ఞ చేసేందుకు షెడ్, పాఠశాలకు గేట్ నిర్మాణానికి సాయం చేశారు. ఇంటర్ అనంతరం జేఎన్టీయూలో ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్ పట్టా పొందారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత దూరదర్శన్‌లో గాయకుడిగా పనిచేశారు. 1993లో తాజ్‌మహల్ సినిమాతో సినీగేయ రచయితగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. చంద్రబోస్‌కు భార్య సుచిత్ర, కుమార్ వనమాలి, కూతురు అమృత వర్షిణి ఉన్నారు.
మా ఊరిలో జన్మించిన చంద్రబోస్ తన ప్రతిభతో చల్లగరిగె పేరును ప్రపంచమంతా తెలిసేలా చేయడం ఆనందంగా ఉంది. సినీరంగంలో మా ఊరివాడు ఇంతటి పేరు సంపాందించినందుకు మా గ్రామస్తులమంతా గర్విస్తున్నాం. ఎంత ఎదిగినా సొంత ఊరికి వచ్చినప్పుడు అందరితో కలివిడిగా మాట్లాడుతుంటారు. ఉన్న ఊరికోసం, కన్నావారి కోసం కష్టపడుతూ అంచెలంచెలుగా ఎదగడం ఆనందంగా ఉంది. చంద్రబోస్‌గారికి కంగ్రాచ్యులేషన్స్.
– కర్రె మంజూల-అశోక్‌రెడ్డి, చల్లగరిగె సర్పంచ్
సినీగేయ రచయిత చంద్రబోస్ నా బాల్య మిత్రుడు. నేను ఆయన కలిసి పదో తరగతి (1984-85బ్యాచ్) వరకు మా ఊరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాం. ఆ రోజుల్లో స్కూల్లో జానపద గేయాలు పాడేవాడు. భజన కార్యక్రమాల్లో భక్తి పాటలు పాడేవాడు. దాదాపు 3వేలకు పైగా పాటలు రాసి మా ఊరి నుంచి ప్రపంచం గుర్తించే స్థాయికి ఎదగడం ఆనందంగా ఉంది.
– దావు వీరారెడ్డి, చంద్రబోస్ మిత్రుడు
జయశంకర్ భూపాలపల్లి, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్‌కు ఆర్ఆర్ఆర్ సినిమాలో రాసిన నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు రావడం గర్వించదగ్గ విషయం. సమైక్య రాష్ట్రంలో కవులు, కళాకారులను ఎంతో చిన్న చూపు చూసేవారు. ఇప్పుడు చంద్రబోస్‌కు ప్రపంచస్థాయి అవార్డు రావడం ద్వారా తెలంగాణ కళాకారులకు అసమాన ప్రతిభ ఉందని నిరూపితమైంది. మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన చంద్రబోస్‌కు ఇంత గొప్ప ఆస్కార్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు.
– ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
మా గురువుగారు చంద్రబోస్. నేను ఆయనను ఆదర్శంగా తీసుకుని పాటలు రాస్తున్నా. నా ఆదర్శ వ్యక్తికి ఆస్కార్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. చంద్రబోస్ మారుమూల గ్రామంలో పుట్టి ఎంతో గొప్ప రచయితల మధ్యలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పల్లె టూరి నుంచి వెళ్లి ప్రపంచం గుర్తించేలా ఎదిగిన చంద్రబోస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– మ్యాదరి సునీల్, యువకవి, జూకల్ నివాసి