హనుమకొండ/వరంగల్, మార్చి 31 : ఎల్ఆర్ఎస్తో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రిజిస్ట్రేషన్ ఆఫీసులకు అదనపు ఆదాయం సమకూరుంది. గత నెల 3న 25 శాతం రాయితీతో ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రెగ్యులర్ డాక్యుమెంట్లతో పాటు అదనంగా 869 ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్లు అయినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం రంజాన్ పండుగ సెలవును ఈ కార్యాలయాలకు రద్దు చేయడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 137 రిజిస్ట్రేషన్లు అయినట్లు పేర్కొన్నారు.
జనగామ కార్యాలయంలో గరిష్ఠంగా 226 ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్లు కాగా కనిష్ఠంగా వర్ధన్నపేటలో ఒకటి కావడం విశేషం. అలాగే భీమదేవరపల్లిలో 50, భూపాల్‌పల్లిలో 59, స్టేషన్ఘన్పుర్లో 13, కొడకండ్లలో 5, మహబూబాబాద్‌లో 101, ములుగులో 91, నర్సంపేటలో 23, పరకాలలో 3, వరంగల్ రూరల్‌లో 50, వరంగల్ ఆర్వోలో 137, ఖిలా వరంగల్‌లో 110 రిజిస్ట్రేషన్లు అయ్యాయి.
బల్దియాకు భారీగా ఆదాయం
ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) ద్వారా బల్దియాకు రూ. 94 కోట్ల ఆదాయం సమకూరింది. సోమవారం రాత్రి 8 గంటల వరకు 14 వేల మంది దరఖాస్తుదారులు ఫీజు చెల్లించగా అర్ధరాత్రి 12 గంటల వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించే అవకాశం ఉండటంతో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. సోమవారం చివరి రోజు కావడంతో పండుగలున్నా పెద్ద ఎత్తున దరఖాస్తుదారులు ఫీజు చెల్లించారు. ఉగాది, రంజాన్ పండుగల సెలవు దినాల్లో సైతం టౌన్‌ప్లానింగ్ సిబ్బంది ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి సేవలందించారు. సాంకేతిక
కారణాలతో ఫీజుల మదింపులో దొర్లిన తప్పులను సరిచేశారు. అయితే ప్రభుత్వం చివరి గడువుకు 10 రోజుల ముందు ఎడిట్ ఆప్షన్ ఇవ్వటంతో ఆదాయం తగ్గిందని, ముందుగానే ఇస్తే మరింత మంది ఫీజు చెల్లించేవారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మరికొన్ని రోజులు రాయితీకి అవకాశం కల్పించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. కాగా, టౌన్ ప్లానింగ్ సిబ్బంది పనితీరును మేయర్ గుండు సుధారాణి ప్రశంసించారు. సోమవారం కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లోని హెల్ప్ డెస్క్‌ను పరిశీలించిన ఆమె పండుగ రోజుల్లో సైతం విస్తృత సేవలందించిన సిబ్బందిని అభినందించారు.