స్టేషన్ ఘన్పూర్, జూన్ 16 : ఇద్దరి ఇండ్లు ఒకే వీధిలో, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. కలిసి చదువుకున్నారు. వారి స్నేహం కాస్త ప్రేమగా మారింది. మూడేళ్లుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. అమ్మాయి ఇంట్ల్లో వారు పెండ్లికి ఒప్పుకోకపోవడంతో ఆ ప్రేమజంట ఆదివారం రాత్రి ట్రైన్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం నమిలిగొండ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కోటె రాజయ్య-లక్ష్మి దంపతుల కుమారుడు వినయ్ కుమార్(25), మచ్చ కుమార్-రేణుక దంపతుల కూతురు శృతి(23) కుటుంబాలు ఒకే వీధిలో ఉంటాయి.
వినయ్‌కుమార్, శృతి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. వీరి తల్లిదండ్రులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుండగా, గ్రామంలో ఇద్దరికి మంచిపేరు ఉంది. అయితే శృతి హైదరాబాద్‌లోని తన అక్క ఇంట్లో ఉంటూ విప్రోలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నది. అప్పుడప్పుడూ నమిలిగొండకు వచ్చి వెళ్తూ ఉంటుంది. వినయ్‌కుమార్ స్టేషన్ ఘన్‌పూర్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. వీరి ప్రేమ విషయాన్ని అబ్బాయి తల్లిదండ్రులు అంగీకరించగా, అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించలేదు.
ఆ అబ్బాయిని వివాహం చేసుకుంటే ఆత్మహత్య చేసుకుంటానని మృతురాలి తండ్రి బెదిరించాడు. అంతే కాకుండా అమ్మాయికి కాజీపేటకు చెందిన అబ్బాయిని చూశాడు. ఈ క్రమంలో వినయ్‌కుమార్ తన బైక్‌పై భువనగిరికి వెళ్లగా అక్కడికి శృతి వచ్చింది. ఇద్దరు కలిసి యాదగిరిగుట్టకు వెళ్లినట్లు తెలిసింది. అక్కడినుంచి భువనగిరి టోల్గేట్ సమీపంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద ఆదివారం రాత్రి 8-9 గంటల ప్రాంతంలో రైలు కిందపడి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.