గీసుగొండ, నవంబర్ 29 : మండలంలోని ఊకల్ నాగేంద్రస్వామి ఆలయంలో మంగళవారం శ్రీ వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది. ఉదయం స్వామి వారికి అభిషేకం, అలంకరణ, మూలమంత్ర హోమాలను అర్చకులు సుదర్శనాచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో వేదమంత్రోచ్ఛారణల నడుమ కల్యాణ తంతును అత్యంత వైభవం గా నిర్వహించారు. ఈ వేడుకను కనులారా వీక్షించి తరించేందుకు వరంగల్, హనుమకొండ పట్టణాలతోపాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కల్యాణ వేడుకల్లో స్థానిక జడ్పీటీసీ పోలీ సు ధర్మారావు, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు వీరగోని రాజుకుమార్, సర్పంచ్ మొగసాని నాగదేవత, ఎంపీటీసీ వీరరావు, పీఏసీఎస్ చైర్మన్ మండల వీరస్వామి పాల్గొన్నారు.
రైల్వే దేవాలయంలో..
కాజీపేట : కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలోని రైల్వే దేవాలయ సముదాయంలోని శ్రీ హరిహర పుత్ర శ్రీ ధర్మశాస్త్ర ఆలయంలో, శ్వేతార్క మూలగణపతి దేవాలయంలో వేర్వురుగా మంగళవారం శ్రీ వల్లి దేవసేనా సుబ్రహ్మణ్యస్వామి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. రైల్వే దేవాలయం నుంచి అయ్య ప్ప కన్నెస్వాములు పాల కావడుల్లో పాలతో చౌరస్తా సమీపంలోని భ్రమరాంభికామల్లిఖార్జున స్వామి దేవాలయానికి వెళ్లి స్వామి వారికి పాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. తిరిగి దేవాలయం నుంచి పన్నీరు కావడిలతో అయ్యప్పస్వామి దేవాలయానికి చేరుకొని సుబ్రహ్మణ్యస్వామికి పన్నీరు అభిషేకం చేశారు. అనంతరం స్వామివారికి మంగళస్నానం చేయించి కల్యాణ అలంకరణ చేసి ఎదురుకోళ్లు నిర్వహించారు.
శ్రీ వల్లీ దేవసేన సమేత, స్వామివారిని మండపానికి తీసుకొచ్చి వేదపండితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ వైభవంగా కల్యాణ తంతు నిర్వహించారు. బంగారి కుమారస్వామి దంపతులు, గోపాల కృష్ణ దంపతులు, పాక వేణుమాధవ్, సారంగపాణి, స్వామినాయక్ దంపతులు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలను తిలకించేందుకు కాజీపేట పట్టణంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు సిరిపురం వెంకటయ్యస్వామి, బుర్ర జనార్దన్ స్వామి, ఆవాల పురుషోత్తంరెడ్డి స్వామి, ఓర్సు యాకయ్యస్వామి, నూనె కనుకయ్యస్వామి, పూల రమేశ్ స్వా మి, కోటగిరి సంపత్ స్వామి, పాక శ్రీనివాస్‌స్వామి, వం గాల నళినీకాంత్స్వామి, తదితరులు పాల్గొన్నారు.