లింగాలఘనపురం, ఏప్రిల్ 22 : కాంగ్రెస్లో గ్రూపు తగాదాలు మరోసారి భగ్గుమన్నాయి. తాజాగా సోమవారం మండలంలోని నేలపోగులలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఎంపీటీసీ గుగ్గిళ్ల నర్సయ్య అనుచరులు హల్చల్ చేశారు. గుగ్గిళ్ల నర్సయ్య కాంగ్రెస్ సాంస్కృతిక సేన రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. పార్టీలో చేరికల్లో దూసరి గణపతి వర్గాన్ని ఎలా తీసుకున్నారని నర్సయ్య వర్గీయులు నిలదీశారు. ఈ విషయమై గతంలోనూ గుర్తు చేశామంటూ సమావేశాన్ని బహిష్కరించారు. దీంతో మండల నాయకులు చేసేదేమి లేక సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించడం విశేషం.