ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి జోరందుకుంది. రిజర్వేషన్ స్థానాలు ఈ సారి మారే అవకాశం ఉన్నందున ఏ స్థానం ఎవరికి పోతుందోనని ఆశావహులకు దడ పుట్టిస్తున్నది. వీరితో పాటు రాజకీయ వర్గాల్లో సైతం ఆసక్తి నెలకొంది. పంచాయతీ రాజ్ కమిషనర్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం సర్పంచ్, వార్డుసభ్యులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీల స్థానాలకు కుల గణన ఆధారంగా బీసీలకు 42 శాతం, 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసింది. కానీ, ప్రకటించకపోవడంతో ఉత్కంఠ చోటుచేసుకుంది.
– హనుమకొండ, సెప్టెంబర్ 23
సర్పంచ్‌లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీల పాలకవర్గం గడవు ముగిసి సంవత్సరన్నర కాగా, ఎన్నికలు నిర్వహిస్తే తాము పోటీ చేయాలనుకొనే స్థానాలు రిజర్వేషన్లో ఎటు పోతాయోనని ఆశావహులు ఎదురు చూస్తున్నారు. అయితే రిజర్వేషన్ల ప్రక్రియ ఎటూ తేలకపోవడంతో వాయిదా పడుతూ వస్తుంది. హైకోర్టు ఈ నెల 30వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణలో పునరాలోచనలో పడింది. ఎన్నికల నిర్వహణకు బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ ప్రధాన అడ్డంకిగా మారిందనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.
అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి గ్రామపంచాయతీల రిజర్వేషన్లు 10 ఏండ్ల పాటు కొనసాగాలని పొందుపరిచింది. అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ చట్టాన్ని సవరించింది. దీంతో రిజర్వేషన్లు మారనుండడంతో పాటు బీసీలకు 42 రిజర్వేషన్ కల్పించాలనే నిర్ణయంతో ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల రాష్ట్రప్రభుత్వం చేపట్టిన కుల గణన ఆధారంగా బీసీలకు 42 శాతం కల్పించనున్నారు. దీంతో కొన్ని స్థానాలు పెరుగనున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలకు ఎప్పటిలాగే రిజర్వేషన్లు కొనసాగే అవకాశం ఉంది. కాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్ల స్థానంలో 50 శాతం సీట్లు మహిళలకు దక్కనున్నట్లు సమాచారం.
ముందు ప్రాదేశికం..
రిజర్వేషన్ల ప్రక్రియ ఎటూ తేలకపోవడంతో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు మరింత గడువు కోరాలనే చూస్తూనే మరో పక్కన ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించింది. కాగా ఇప్పటికే గ్రామపంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్ల వివరాలు వెల్లడించింది. స్థానిక ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియను అధికారులు పూర్తి చేసినప్పటికి ప్రకటించకుండా సీక్రెట్‌గానే ఉంచారు.
ఉదాహరణకు ఒక మండలంలో 30 వార్డులుంటే అందులో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ఇతరకు ఎన్ని కేటాయించాలనేది ప్రభుత్వానికకి పంపగా, దీని ప్రకారమే రిజర్వేషన్లు చేపట్టినట్లు తెలిసింది. అలాగే ప్రభుత్వం జీవో జారీ చేసే వరకు రిజర్వేషన్ల వివరాలను ప్రకటించవద్దని ఆదేశించినట్లు సమాచారం. అయితే రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించిన జీవో నేడో, రేపో వెలువడే అవకాశం ఉంది. జీవో జారీ అయితే రిజర్వేషన్ల వివరాలు వెల్లడించనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు.