వరంగల్, డిసెంబర్ 12 : ఈఎన్టీ రాష్ట్ర సదస్సులో కరోనా అనంతరం వస్తున్న వ్యాధులపై సమగ్ర చర్చ జరిగింది. వాటిని ఎదుర్కొనేందుకు సదస్సు దిశా నిర్దేశం చేసింది. రెండు రోజుల పాటు కాకతీయ మెడికల్ కళాశాల ఎన్ఆర్ఐ భవనంలో జరిగిన ఈఎన్టీ రాష్ట్ర సదస్సు ఆదివారం ముగిసింది. సుమారు 400 మంది ఈఎన్టీ డాక్టర్లు సదస్సుకు హాజరుకాగా అందులో 250 మంది డాక్టర్లు పరిశోధన పత్రాలు సమర్పించారు. మొదటి రోజు కరోనా అనంతరం వచ్చిన కొత్త రకాల వ్యాధులపై చర్చించారు. వాటి చికిత్సలో ఎదురైన సమస్యలు, వాటిని అధిగిమించేందుకు చికిత్సలో తీసుకున్న కొత్త విధానాల గురించి వివరించారు. రెండో రోజు ముగింపు సదస్సులో అనేక మంది సీనియర్ డాక్టర్లు ప్రసగించారు. రానున్న కాలంలో వచ్చే వ్యాధులపై డాక్టర్లు ఎప్పటికప్పుడూ అధ్యయనం చేయాలని సూచించారు. కరోనా అనంతరం వస్తున్న కొత్త వ్యాధులు డాక్టర్లకు సవాళ్లు విసురుతున్నాయని, వాటిని సమర్థంగా ఎదుర్కొంటూ రోగులకు మెరుగైన చికిత్స అందించాలని పేర్కొన్నారు.
ఈఎన్టీ రాష్ట్ర సదస్సు ముగింపు రోజు ప్రముఖ డాక్టర్ల సర్జరీలను లైవ్ టెలికాస్ట్ ద్వారా చూపించారు. బ్లాక్ ఫంగస్ లాంటి క్లిష్టమైన సర్జరీలను ప్రదర్శించారు. ముంబాయి, బెంగళూరు, చెన్నై నగరాల్లోని దవాఖానల్లో ప్రముఖ డాక్టర్లు చేసిన సర్జరీలను చూపించారు. డాక్టర్లు లైవ్‌లో సర్జరీకి సంబంధించిన విషయాలను వివరించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన డాక్టర్లు తమ మిత్రులతో కలిసి ఫొటోషూట్ తీసుకున్నారు. సదస్సులో ఈఎన్టీ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్, కార్యదర్శి రమేశ్, ప్రోగ్రాం చైర్మన్ డాక్టర్ పరశురాం, డాక్టర్ సుదీప్, డాక్టర్ సాంబశివరావు, డాక్టర్ రమేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈఎన్టీ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ సుదీప్..
ఈఎన్టీ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా వరంగల్‌కు చెందిన డాక్టర్ మాడిశెట్టి సుదీప్ ఎన్నికయ్యారు. ఈఎన్టీ రాష్ట్రముగింపు సదస్సులో 2020-21 సంవత్సరానికి రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ సుదీప్, ఉపాధ్యక్షుడిగా డాక్టర్ రవిశంకర్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ ఆర్ రమేశ్, సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ రవికాంత్, కోశాధికారిగా సాహుల్ హమీద్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌గా డాక్టర్ గౌడ రమేశ్, డాక్టర్ వెంకటరత్నం, డాక్టర్ బాబూజాన్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ సుదీప్‌ను శాలువాలతో ఘనంగా సన్మానించారు.