ములుగు, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : మేడారం మహాజాతరలో మద్యం దందా ‘మూడు పువ్వులు.. ఆరు కాయలు’ గా అన్న చందంగా సాగుతున్నది. ఎక్సైజ్ శాఖ తమ విధులను విస్మరించి.., నిబంధనలను గాలికొదిలి మద్యం అమ్మకాలకు టార్గెట్లు ఫిక్స్ చేయగా, వ్యాపారులు రెట్టింపు రేట్లకు మద్యం విక్రయిస్తూ భక్తులను నిలువుదోపిడీ చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వనదేవతలకు మొక్కులు చెల్లించేందుకు వచ్చిన భక్తులు అమ్మవారికి తనివితీరా మొక్కులు చెల్లించి, పరిసర ప్రాంతా ల్లో విడిది చేసి.., సంబురంగా గడుపుతారు. అయితే, జాతరలో మద్యం కొనుగోలు చేద్దామనుకొనే వారికి ఇక్కడి వ్యాపారులు, బెల్ట్ దుకాణాదారులు చుక్కలు చూపిస్తున్నారు.
మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు పెంచి భక్తులను దోచుకుంటున్నారు. ఎమ్మార్పీ కంటే రూ.10 లేదా రూ.20 ఎక్కువగా తీసుకోవాలి.. కానీ, క్వార్టర్‌కు రూ.వంద చొప్పున పెంచి అమ్మడమేంటని భక్తులు వాపోతున్నారు. ఇక్కడ దుకాణాదారుడు చెప్పిన ధరే ఫైనల్ కావడంతో అధికారులు, ప్రభుత్వ తీరుపై విమర్శలు చేస్తున్నారు. తాడ్వాయి మండలంలో నాలుగు మద్యం షాపులు అధికారికంగా ఉండగా.., వందలాది బెల్ట్ షాపులు మేడారం జాతర పరిసర ప్రాంతాల్లో వెలిశాయి.
ఎక్సైజ్ శాఖ ద్వారా మంజూరైన మద్యంషాపులు కాటాపూర్, తాడ్వాయి, మేడారం, కొత్తూరులో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేయాల్సి ఉండగా, మద్యం వ్యాపారులు సిండికేట్ మారి, తాడ్వాయితోపాటు మేడారంలో ఏర్పాటు చేసే రెండు షాపులను ఒకేచోట పెట్టారు. ఒక షాపులో హోల్‌సేల్, మరోషాపులో రిటైల్ దుకాణాలు నిర్వహిస్తూ.., క్వార్టర్‌కు రూ.20, ఆఫ్‌కు రూ.40, ఫుల్ బాటిల్‌కు రూ.80, బీరుకు రూ.20 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. అది కూడా తమనకు నచ్చిన, లాభాలు ఎక్కువ ఉన్న మద్యాన్ని మాత్రమే విక్రయిస్తున్నారు.
ఇక బెల్ట్ షాపుల దోపిడీకి అడ్డూఅదుపు లేదు. మద్యం దుకాణాల నుంచి అధిక ధరకు కొనుగోలు చేసి తాను పెట్టిన పెట్టుబడికి మూడింతలు వచ్చేలా ఒక్కో క్వార్టర్, బీరుకు రూ.100 చొప్పున అదనంగా వసూలు చేస్తూ భక్తులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా, సంబంధిత శాఖ అధికారులు చూసీచూడనట్లుగా, మామూళ్ల మత్తులో తేలియాడుతున్నారని భక్తులు విమర్శిస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా సదరు దుకాణాదారులను ముందే అలర్ట్ చేసి చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు. ఇటు అధిక రేట్లతో విక్రయదారులు, అటు మామూళ్ల మత్తులో అధికారులు మేడారం జాతరలో జేబులు నింపుకుంటున్నారు.
జాతరలో కల్తీ మద్యానికి దారులు
అధిక రేట్లతో భక్తులను దోచుకుంటున్నది చాలక కొందరు వ్యాపారులు కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్నారు. స్పిరిట్ కలిపిన మద్యాన్ని యథేఛ్చగా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. భక్తులు ఈ కల్తీ మద్యాన్ని ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. జాతరలో అమ్ముతున్న మద్యం నాణ్యమైనదా..? ఎమ్మార్పీ ఎంత ఉంటే అదనంగా ఎంత వసూలు చేస్తున్నారు..? అన్న విషయాలపై ఎక్సైజ్ శాఖ ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తున్నది.