హనుమకొండ, అక్టోబర్ 29: సంక్షేమం, అభివృద్ధి చేతకాక కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ, ప్రజా వ్యతిరేక పాలనకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు. విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని రాష్ట్ర సర్కారు వెనకి తీసుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం బాలసముద్రంలోని పార్టీ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీగా నకలగుట్టలోని టీజీఎన్పీడీసీఎల్ భవన్‌కు చేరుకున్న శ్రేణులు పటాకులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు.
పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతియుతంగా సంబురాలు జరుపుకోవడంతో పాటు విద్యుత్ అధికారులకు స్వీట్లు పంపిణీ చేసి కృతజ్ఞతలు తెలుపుదామని వచ్చిన తమను అడ్డుకోవడం ఏమిటని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ విద్యుత్ చార్జీలు పెంచకుండా పోరాడి అడ్డుకున్న ఘనత బీఆర్ఎస్ పార్టీ, నాయకుడు కేటీఆర్, శాసన మండలి ప్రతిపక్షనేత మధుసుదనాచారి, పార్టీ నాయకులదేనని అన్నారు. పార్టీ అధినేత కేసీఆర్ పదేళ్ల పాలనలో ఏనాడూ విద్యుత్ చార్జీలు పెంచలేదని తెలిపారు. విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా పబ్లిక్ హియరింగ్‌లో పాల్గొని ఈఆర్సీని కేటీఆర్ విద్యుత్ బిల్లులు పెంచకుండా ఒప్పించారని పేర్కొన్నారు.
ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతుకను బలంగా వినిపిస్తామన్నారు. ప్రభుత్వాన్ని నిలదీస్తే బీఆర్ఎస్ నాయకులపై దాడులు, ఆరోపణలు చేస్తూ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. పది నెలల కాలంలోనే ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ ప్రభుత్వం మూటకట్టుకుందని అన్నారు. హైదరాబాద్‌లో హైడ్రా మాదిరిగా వరంగల్ ప్రజల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తి లేదని, పేద ప్రజలకు బీఆర్ఎస్ అండగా నిలుస్తూ పోరాటం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కుడా మాజీ చైర్మన్లు సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్లు బోయినపల్లి రంజిత్‌రావు, నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, మైనార్టీ నాయకులు నయీముద్దీన్, నాయకులు రవీందర్రావు, జానకి రాములు, పోలంపెల్లి రామ్మూర్తి, విద్యార్థి సంఘం నాయకుడు రాకేశ్‌యాదవ్, ప్రణయ్, రఘు, కార్యకర్తలు పాల్గొన్నారు.