గూడూరు, జూలై 12 : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రం సమీపంలో చిరుత పులి సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం గ్రామానికి చెందిన రైతు భాషబోయిన ఐలయ్య కోటి చెరువు వెనుక ఉన్న తన పొలం వద్దకు వెళ్లాడు. ఏపుగా ఉన్న జీలుగు చెట్ల మధ్య అలికిడి కావడం, పక్షులు పెద్దగా అరుస్తూ ఎగిరిపోవడంతో భయపడిన ఐలయ్య వెంటనే ఇంటికి వచ్చాడు.
తిరిగి ఆదివారం ఉదయం కొంతమంది రైతులతో కలిసి వెళ్లి పరిశీలించగా గుర్తు తెలియని జంతువు పాదముద్రలు కనిపించాయి. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎఫ్ఆర్వో ప్రసాద్ ఆదేశాల మేరకు ఫారెస్ట్ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకొని పాదముద్రలను పరిశీలించి, వాటిని ఫొటో తీసి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగా అవి చిరుతపులివిగా ప్రాథమికంగా గుర్తించారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్వో మాట్లాడుతూ కొన్ని రోజులుగా చిరుత పులి సంచరిస్తున్నట్లు సమాచారం ఉందని, ప్రజలు దానికి ఎలాంటి హాని తలపెట్టొద్దని, అది కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.