ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. వరంగల్ జిల్లాలో గత నెలలో కొన్ని చౌక దుకాణాల్లో రేషన్ బియ్యం పంపి ణీ పదిహేను రోజులు ఆలస్యమైంది. పునరావృతం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ నెలలో కూడా అదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ 62 చౌక దుకాణాలకు 531 టన్నుల బియ్యం చేరుకోలేదు. ఒకటో తేదీ నుంచి పంపిణీ చేయాల్సిన పీడీఎస్ బియ్యం ఇంకా రాకపోవడంతో కార్డుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
– వరంగల్, సెప్టెంబర్ 10(నమస్తేతెలంగాణ)
జిల్లాలో 509 చౌక దుకాణాల ద్వారా ప్రతి నెలా కార్డుదారులకు ప్రభుత్వం సుమా రు 4,117 టన్నుల పీడీఎస్ రైస్‌ను పంపిణీ చేయాల్సి ఉంది. విధిగా ఒకటో తేదీ నుంచి ప్రారంభించాలని ప్రభు త్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అంతకు ముందే అంటే 31లోగా అన్ని చౌక దుకాణాల డీలర్లకు రేషన్ బియ్యాన్ని అందజేయాల్సి ఉంటుంది. పీడీఎస్ రైస్ కేటాయింపులు, డీలర్ డబ్బు చెల్లించడం, పౌరసరఫరాల సంస్థ మండల లెవల్ స్టాక్(ఎంఎల్ఎస్) గోదాం నుంచి చౌకదుకాణాలకు రేషన్ బియ్యం చేరుకోవడం వంటివన్నీ నెలాఖరులోగా పూర్తయ్యేలా సంబంధిత అధికారులు ప్రణాళిక సిద్ధం చేయాలి. కొద్ది నెలల నుంచి ఇది సంపూర్ణంగా జరగడం లేదు.
ప్రధానంగా స్టేజీ-1 గోదాముల నుంచి ఎంఎల్ఎస్ గోదాములకు పీడీఎస్ రవాణాపై ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్, పౌరసరఫరాల సంస్థకు మధ్య వివాదం తలెత్తడంతో గత జూలై నుంచి పీడీఎస్ రైస్ సరఫరా, పంపిణీలో గందరగోళ పరిస్థితి తలెత్తింది. ఆగస్టులో కార్డుదారులకు పం పిణీ చేయాల్సి న పీడీఎస్ రైస్ ను జూలై నెలాఖరులోగా చౌక దుకాణాల డీలర్లకు అందజేయాల్సి ఉండగా ఆగస్టు పదహారో తేదీ వరకు కొనసాగింది. చివరకు కొన్ని చౌక దుకాణాల పరిధిలోని కార్డుదారులకు రైస్ పంపిణీ జరుగలేదు.
ఈ నెలలోనూ అదే పరిస్థితి
ఆగస్టు 31లోగా 4,117 టన్నుల పీడీఎస్ రైస్‌ను ఎంఎల్ఎస్ గోదాంల వద్ద పౌరసరఫరాల సంస్థ అధికారులు అందజేయాల్సి ఉండగా 1,000 టన్నుల రేషన్ బియ్యాన్ని మాత్రమే అందజేసినట్లు తెలి సింది. స్టేజీ-1 గోదాంల నుంచి ఎంఎల్ఎస్ గోదాంలకు పీడీఎస్ రైస్‌ను రవాణా చేయడానికి ప్రభుత్వంతో కుదుర్చుకున్న టెండర్ కాలపరిమితి ఒప్పం దం గడువు ముగిసి మూడేళ్లు అవుతున్నందున ట్రాన్స్పోర్ట్ రేటు గిట్టుబాటు కావడం లేదని కాంట్రాక్టర్ జూలై నుంచి రవాణా చేయడం లేదు.
కరీంనగర్ తదితర జిల్లాల నుంచి సీఎంఆర్ బియ్యాన్ని జిల్లాకు రవాణా చేయడానికి ముందుకు రావడం లేదు. కాంట్రాక్టర్, పౌరసరఫరాల సంస్థ మధ్య ట్రాన్స్‌పోర్టు వివాదం పరిష్కారం కాలేదు. దీంతో స్థానికంగా రైస్‌మిల్లర్లు డెలివరీ చేస్తున్న సీఎంఆర్ బియ్యాన్ని ఎంఎల్ఎస్ గోదాంల ద్వారా పౌరసరఫరాల సంస్థ అధికారులు రేషన్ డీలర్లకు అందజేస్తున్నారు.
ఇంకా 62 చౌకదుకాణాలకు…
మంగళవారం వరకు జిల్లాలో 447 చౌక దుకాణాలకు సుమారు 3,586 టన్నుల పీడీఎస్ రైస్ అందజేశారు. ఇంకా 62 షాపులకు సుమారు 531 టన్నుల రేషన్ బియ్యాన్ని అందజేయాల్సి ఉంది. మరి కొద్ది రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. గత నెలలో ఇలాంటి సమస్యే తలెత్తిన దరిమిలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. ముఖ్యంగా ఈ నెల 7న వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో రహదారులపై మండపాలు వెలిశాయి.
ఈ నేపథ్యంలో పీడీఎస్ రైస్‌తో వెహికిల్స్ రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతున్నట్లు రేషన్ డీలర్లు తెలిపారు. ఆగస్టులో రేషన్ డీలర్లకు 16వ తేదీ వరకు బియ్యం అందజేసినందున ఈ నెలలో ఎప్పటి వరకు కొనసాగనుంది?, కార్డుదారులకు పీడీఎస్ రైస్ పంపిణీ ఎప్పటివరకు జరుగుతుంది? అనేది చర్చనీయాంశమైంది. పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ సంధ్యారాణిని వివరణ కోరగా ఒకటి రెండు రోజుల్లో అన్ని చౌక దుకాణాలకు రేషన్ అందగలవని చెప్పారు.