నర్సంపేట, డిసెంబర్ 7: ధరణిలో భూ సమస్యలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని గుర్తించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ గోపి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. పట్టణంలో మంగళవారం వారు పలు అభివృద్ధి పనులపై జిల్లాస్థాయి అధికారులతో సమీక్షించారు. ధరణిలో సంస్థల పేరుపై ఉన్న భూములకు పట్టా చేయించుకోవచ్చని వారు సూచించారు. పోర్టల్‌లో 12 రకాల సమస్యలు ఎక్కువగా ఉత్పన్నం అవుతున్నట్లు గుర్తించామన్నారు. అనుమతుల సమస్యలను వేగంగా పరిష్కరించాలని కోరారు. వీవో, అంగన్వాడీ, ఇతర గ్రామస్థాయి అధికారిక కార్యాలయాల నిర్మాణాలకు ప్రభుత్వ భూమిని కేటాయించాలని సూచించారు. చెన్నారావుపేటలో హెల్త్ సెంటర్ మంజూరైందని, సరిపడా ప్రభుత్వ భూమి లేదన్నారు. రెసిడెన్షియల్ స్కూల్ కోసం శాశ్వత భవనం కావాలని కోరారు. మున్సిపల్, రెవెన్యూ పరిధిలో ఉన్న సమస్య తీవ్రంగా ఉందన్నారు. కొండాపూర్‌లో 23 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు. అది అటవీ శాఖ రికార్డుల్లో లేదని, పూర్తిగా రెవెన్యూ పరిధిలో ఉందన్నారు. కన్నారావుపేటలో ఎక్కువ భూమి సీలింగ్‌లో ఉందన్నారు. అక్కడ ఇంకా 194 ఎకరాలకు పట్టాలు ఇవ్వాల్సి ఉందని వెల్లడించారు. గ్రామాల్లో నల్లాలు బిగించడం, లీకేజీలను అరికట్టే పనులు చేయించాలన్నారు. వర్షాకాలంలో ఇతరత్రా కారణాల వల్ల పైపులు లీక్ కావడం వల్ల తాగునీరు కలుషితం అవుతున్నది. అలాంటి సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. రైతు వేదికలు వందశాతం పూర్తయ్యాయి.
ఎరువుల సమస్య ఎక్కడా లేదని, మిర్చి పంటను ఆశించిన తెగులుకు సంబంధించి ఇటీవల ప్రముఖ శాస్త్రవేత్తలతో పరిశీలించినట్లు తెలిపారు. మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందించామన్నారు. సబ్సిడీలు అందించేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నట్లు తెలిపారు. నర్సంపేట నియోజకవర్గంలో వ్యాక్సినేషన్ ఫస్ట్ డోస్ 86 శాతం, సెకండ్ డోస్ 39 శాతం పూర్తయినట్లు వివరించారు. రూ. 56 కోట్లతో 250 పడకల ఆస్పత్రి మం జూరైనట్లు వివరించారు. రూ. 16 లక్షలతో ఆర్టీపీసీఆర్ ల్యాబ్ మంజూరైందని, తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ కోసం స్థలం కావాల్సి ఉందన్నారు. అంత్రాక్స్ వ్యాధిని నిరోధించేందుకు గొర్రెలకు టీకా లు వేయిస్తున్నుట్లు వివరించారు. నేషనల్ స్కీమ్ కింద గొర్రెలు, మేకల యూనిట్లకు 500 పశువుల చొప్పున రూ. 50 లక్షలు సబ్సిడీ ఉంటుందన్నారు. పౌల్ట్రీ పరిశ్రమ కోసం అనేక సబ్సిడీ పథకాలు ఉన్న ట్లు వెల్లడించారు. సమావేశంలో ఆర్డీవో, వ్యవసా య శాఖ జేడీ, మిషన్ భగీరథ ఎస్ఈ, ఈఈలు, డీఎంహెచ్‌వో, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.