జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పర్యావరణ విధ్వంసం యథేచ్ఛగా కొనసాగుతున్నది. పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు అన్ని హంగులతో బీఆర్ఎస్ హయాంలో రూ. 38 లక్షల తో ఏర్పాటు చేసిన బృహత్ ప్రకృతి వనాన్ని అధికార యం త్రాంగం తొలగించింది. ఐదెకరాల్లో ఏపుగా పెరిగిన మొక్కలను నేలపాలు చేసింది. ఆ స్థలాన్ని కోర్టు భవన నిర్మాణానికి కేటాయించింది. చదును చేసి శిలాఫలకం ఏర్పాటు చేసింది. త్వరలో శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేసింది. కోర్టు నిర్మాణానికి మరో చోట స్థలం చూపించాల్సి ఉండాల్సిందని, ప్రకృతి వనాన్ని తొలగించడమేంటని పట్టణ ప్రజానీకం మండిపడుతున్నది.
పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని చెబుతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు ఆచరణలో చూపించడం లేదు. కోర్టు భవన నిర్మాణం కోసం ఐదెకరాల్లో ఏర్పాటు చేసిన బృహత్ పట్టణ ప్రకృతి వనంలో ఏపుగా పెరిగిన మొక్కలను నిర్ధాక్షిణ్యంగా తొలగించారు. ప్రకృతి వనం కోసం వెచ్చించిన రూ. 38 లక్షలను మట్టిపాలు చేశారు. వనంలోని ప్రతి మొక్కను తొలగించి పూర్తిగా చదును చేశారు. త్వరలో ఈ స్థలంలో కోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రకృతి వనాన్ని ఉన్నతాధికారులు తొలగించిన విషయమే తమకు తెలియదని మున్సిపల్ అధికారులు చెప్పడం గమనార్హం. అన్ని హంగులతో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాన్ని తొలగించడంతో అధికారుల వైఖరిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
భూపాలపల్లి పట్టణంలోని కేటీకే 6 ఇైంక్లెన్ సమీపంలో సుమారు ఐదెకరాల స్థలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బృహత్ పట్టణ ప్రకృతి వనాన్ని 2020-21 సంవత్సరంలో ఏర్పాటు చేసింది. స్థలం చుట్టూ ఫెన్సింగ్ చేసి బోరు వేసి డ్రిప్ ఏర్పాటు చేశారు. సుమారు 12,500 మొక్కలు నాటారు. ఇందుకోసం మొత్తం రూ. 38 లక్షలు ప్రభుత్వ నిధులు ఖర్చు చేశారు. నాలుగేళ్లలో మొక్కలు ఏపుగా పెరిగి వనానికి కొత్త శోభను తీసుకొచ్చాయి. ప్రజలు దాన్ని ఉపయోగించుకునే సమయంలో అధికారులు వనాన్ని తొలగించి ఆ స్థలాన్ని జిల్లా కోర్టుకు కేటాయించారు. నాటిన 12,500 మొక్కలను తొలగించి భూమిని చదును చేశారు. దీంతో రూ. 38 లక్షల ప్రజా ధనం వృథా అయింది. ప్రస్తుతం మున్సిపల్ అధికారులు వేయించిన బోరు ద్వారా స్థలంలో కోర్టు నిర్మా ణానికి అవసరమయ్యే ప్రాథమిక పనులు చేస్తున్నారు. అందులో కోర్టు భవన నిర్మాణానికి శిలాఫలకం సైతం ఏర్పాటు చేశారు.