కరీమాబాద్, ఏప్రిల్ 9 : మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అవసరమైన భూమి కోసం సర్వే పూర్తి కాగా, పరిహారంపై చర్చలు కొలిక్కిరావడం లేదు. సుమారు 253 ఎకరాల్లో సర్వే చేయగా, అందులో దాదాపు 300 మంది భూమిని కోల్పోతున్నారు. అధికారులు ఎకరానికి రూ. 50 లక్షల నుంచి 65 లక్షలు పరిహారం ఇస్తామని చెబుతుండగా, రైతులు ఒప్పుకోవడం లేదు. బహిరంగ మార్కెట్లో ఎకరాకు రూ. 2 కోట్ల వరకు ఉంటుందని, రూ. 1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో మరోమారు చర్చలు జరుపనున్నారు.
జిల్లాకు ఎయిర్పోర్టు రాకను అందరూ స్వాగతిస్తున్నా, తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు శ్రద్ధ కనబరచడం లేదని భూయజమానులు విమర్శిస్తున్నారు. భూములిచ్చేందుకు సిద్ధంగా ఉన్నా తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి, ఎమ్మెల్యేలు చర్చించి నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీల అమలు దిశగా చర్యలు చేపట్టడం లేదంటున్నారు. తమకు స్పష్టమైన హామీతో పాటు న్యాయమైన నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.
ఎయిర్పోర్టు నిర్మాణంలో భూమి కోల్పోయిన రైతులతో కలెక్టర్, ఇతర అధికారులు పలు దఫాలుగా చర్చ లు జరిపారు. తొలుత ఎకరాకు రూ.50 లక్షలు, ఆ తర్వాత రూ.65 లక్షలు ఇస్తామని అధికారులు చెప్పా రు. అయితే బహిరంగ మార్కెట్లో భూమి విలువ ఎక్కువగా ఉందని, ఎకరాకు రూ. 1.50 కోట్ల నుంచి 2 కోట్ల వరకు ఇవ్వాలని రైతులు కోరారు. దీంతో మరోమారు చర్చలు జరుపనున్నట్లు అధికారులు తెలిపారు.
ఎయిర్పోర్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ప్రధానంగా రెండు సమస్యలను లేవనెత్తుతున్నారు. ప్రస్తుతం ఉ న్న రహదారిని మూసివేయక ముందే తమకు ప్రత్యామ్నాయం గా దారి నిర్మాణం చేపట్టాలని కో రుతున్నారు. దీంతో పాటు తమ భూములకు ప్రభుత్వం ఎకరానికి ఎంత మేర చెల్లిస్తుం దో ముందే తెలియజేయాలని, అర్హులైన భూనిర్వాసితుల కుటుంబ సభ్యులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని విన్నవిస్తున్నారు. ఈ విషయాలపై ప్రజాప్రతినిధులు, అధికారుల మాటల్లో స్పష్టత లేదని రైతులు పే ర్కొంటున్నారు. అంతేకాకుండా తమతో మాట్లాడి భరోసా ఇచ్చే వారు కరువయ్యారని వాపోతున్నారు.