వరంగల్, అక్టోబర్ 15(నమస్తేతెలంగాణ) : వరంగల్ జిల్లాలో ఎక్సైజ్‌శాఖ పనితీరు తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. ఎనిమిది నెలల నుంచి ఈ శాఖకు రెగ్యులర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఈఎస్) లేరు. ఈ నెల ఒకటి నుంచి ఈఎస్‌గా ఇన్చార్జి బాధ్యతలను కూడా ప్రభుత్వం ఎవరికీ అప్పగించలేదు. దీంతో మద్యం అమ్మకాలపై పర్యవేక్షణ కొరవడింది. గుడుంబా తయారీ, రవాణా, విక్రయాలు పెరిగిపోతున్నాయి. గతంలో వరంగల్ (వరంగల్ రూరల్) ఈఎస్‌గా పనిచేసిన లక్ష్మానాయక్ ఈ ఏడాది ఫిబ్రవరిలో బదిలీపై సూర్యాపేట జిల్లాకు వెళ్లారు. ఆయన స్థానంలో ప్రభుత్వం ఎవరినీ నియమించలేదు. అప్పట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ)గా పనిచేసిన నాగేందర్‌రావుకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది. ఆయన గత నెల 30న ఉద్యోగ విరమణ చేశారు. పదిహేను రోజులు గడిచినా వరంగల్‌కు రెగ్యులర్ ఈఎస్ నియామకం, కనీసం మరో అధికారికి ఇన్చార్జి బాధ్యతలు కూడా అప్పగించలేదు. పైగా జిల్లా కార్యాలయంలోని ఈఎస్ చాంబర్ వద్ద నాగేందర్రావు పేరుతో నేమ్ ప్లేట్ దర్శనమిస్తున్నది. సమాచార హక్కు చట్టం బోర్డుపై కూడా ఆయన పేరే ఉంది. వాటిని తొలగించాల్సి ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడం ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నది. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఏఈఎస్) మురళీధర్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈఎస్ కార్యాలయం పనిచేస్తున్నది. నాగేందర్రావు ఉద్యోగ విరమణ తర్వాత ఇప్పటివరకు ప్రభుత్వం శాఖలో ఎవరికీ ఈఎస్‌గా బాధ్యతలు అప్పగిస్తూ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆర్డర్(డీడీవో) జారీ చేయలేదు.
ఎనిమిది నెలలుగా రెగ్యులర్ ఈఎస్ లేకపోవడం, ఏడు నెలలకుపైగా ఇన్చార్జి కొనసాగడం, పదిహేనురోజుల నుంచి ఎవరూ లేకపోవడంతో జిల్లా పరిధిలో మద్యం విక్రయాలపై పర్యవేక్షణ, నిఘా కొరవడింది. ఇన్చార్జిగా ఉన్న నాగేందర్రావు ఎన్ఫోర్స్మెంట్ బాధ్యతలు కూడా నిర్వహించడంతో జిల్లాలో ఈఎస్‌గా పూర్తి స్థాయిలో విధులు నిర్వర్తించలేదనే ఆరోపణలొచ్చాయి. ఏఈఎస్ మురళీధర్ కూడా అందుబాటులో ఉం డడం లేదనే ఫిర్యాదులున్నాయి. దీంతో జిల్లాలో మద్యం అమ్మకాలపై పర్యవేక్షణ కొరవడింది. ఎమ్మార్పీ ఉల్లంఘన జరుగుతున్నది. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరపై బ్రాందీ, బీర్ల అమ్మకాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఎమ్మార్పీ ఉల్లంఘనపై వర్ధన్నపేట, నర్సంపేట, పరకాల ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలోని మద్యం ప్రియులు అనేకసార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. నియంత్రించాల్సి న స్థానిక ఎక్సైజ్ అధికారులు వైన్‌షాపుల యజమానులకు తమవంతు సహకారం అందిస్తున్నారని తెలిపారు. నిఘా కొరవడడం వల్ల జిల్లాలోకి బెల్లం, పటిక రవాణాతో పాటు గుడుంబా త యారీ, అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. గంజాయి రవాణా, విక్రయాలు కూడా విచ్చలవిడిగా సాగుతున్నాయి. జిల్లాలో ఎన్ఫోర్స్మెం ట్ అధికారి, టీం ఉన్నా తనిఖీలు అంతంత మాత్రంగానే ఉండడంతో ఎక్సైజ్ శాఖ పనితీరు పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.