నల్లబెల్లి, డిసెంబర్ 8 : కేవైసీ పుకార్లు ఓ వృద్ధురాలి ప్రాణం మీదకు తెచ్చాయి. ఈ దఫా తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని కాంగ్రెస్ హామీలు ఇచ్చింది. ఎన్నికల్లో గెలుపొంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి వినియోగదారుడు కేవైసీ చేయించుకుని ఉండాలనే పుకార్లు మండలంలో వ్యాపించాయి. దీంతో ఉదయం ఏడు గంటలకే మహిళలు, వృద్ధులు మండలకేంద్రంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద బారులు తీరుతున్నారు.
శుక్రవారం క్యూ లైన్లో గంటల తరబడి ఉన్న గొల్లపల్లె గ్రామానికి చెందిన 70 ఏండ్ల సల్పాల సమ్మక్క లోబీపీతో కింద పడిపోయింది. వెంటనే అక్కడున్న వారు సమీపంలోని ఓ ప్రైవేట్ వైద్యుడి వద్దకు తరలించి ప్రథమ చికిత్స చేయించారు. ఈ ఘటన పై మహిళలు, ప్రజలు గ్యాస్ ఏజెన్సీ వారి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవైసీ గురించి స్పస్టమైన ప్రకటన చేయాలని కోరుతున్నారు.