మహదేవపూర్..)కాళేశ్వరం ) మే 15: కాళేశ్వరం పుష్కరాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నాడని ముందస్తుగా ఎస్ఎఫ్ఐ నాయకులను అరెస్ట్ చేయడం దారుణమని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని గత కొన్ని సంవత్సరాలుగా అనేకమైన పోరాటాలు, ఉద్యమాలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.
ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే విద్యా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యారంగానికి అధిక శాతం నిధులు కేటాయిస్తామని చెప్పి విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాము ఇచ్చినటువంటి హామీలన్నీ తుంగలో తొక్కుతుందని మండిపడ్డారు. తక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరన్నారు.