నల్లబెల్లి, ఏప్రిల్ 12 : మహాత్మ జ్యోతిరావు పూలే స్ఫూర్తితో దళిత బహుజనులంతా ఏకం కావాలని బీసీ హక్కుల సాధన సమితి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది కుమారస్వామి అన్నారు. ఈ మేరకు నల్లబెల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేల సంవత్సరాలుగా దేశంలో అమలవుతున్న వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా దళిత బహుజనుల కోసం తన జీవితమంతా కృషి చేశాడని ఆయన స్ఫూర్తితో నేడు దళిత బహుజనులంతా ఐక్యం కావలసిన అవసరం ఉందన్నారు.
దేశంలో కుల వివక్ష అంటరానితనం, వెట్టిచాకిరి దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా జ్యోతిరావు పూలే తన జీవితాంతం పోరాడటమే కాకుండా శూద్ర, అతిశూద్రులైన బహుజనులకు చదువు చెప్పించడం కోసం తన సతీమణి సావిత్రిబాయి పూలే కు మొదట చదువు నేర్పి దళితవాడల్లో గ్రామాలలో పాఠశాలలను ఏర్పాటు చేసి బహుజనులకు చదువును అందించారన్నారు. చదువు ద్వారా జ్ఞానం పెంపొందించుకొని తన జ్ఞానం ద్వారా అణిచివేత దోపిడిని ఎదుర్కొనే మార్గాలను అన్వేషించే అవకాశం ఉంటుందని భావించి ఆనాడు విద్యను అందించారన్నారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం పైన కూడా జ్యోతిరావు పూలే ప్రభావం ఉందన్నారు .అందుకే భారత రాజ్యాంగంలో విద్యను, ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కులుగా చేర్చారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరి నినాదం జైపూలే- జై భీమ్ కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైరాల వీరస్వామి, హరీష్ వీరమల్లు, మహ్మద్ సద్దాం, డాక్టర్ గాదం సురేష్, బూస కుమారస్వామి మనుగొడ బాబు, క్రాంతి, కోల లింగయ్య, బండి సదయ్య, మధు, బొడిగె సిద్దూ తదితరులు పాల్గొన్నారు.