హనుమకొండ చౌరస్తా, జూలై 5 : ఈ నెల 7న కాకతీయ విశ్వవిద్యాలయ 23వ స్నాతకోత్సవాన్నికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి తెలిపారు. శనివారం కేయూ సెనేట్ హాల్లో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం, పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ సమక్షంలో ఆయన విలేకరులతో వివరాలు వెల్లడించారు. స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్స్లర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్య అతిథిగా శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత, ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు.
ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యే స్నాతకోత్సవంలో ఆర్ట్స్ ఫ్యాకల్టీలో 60 గోల్డ్ మెడల్స్, 56 పీహెచ్‌డీలు, సైన్స్ ఫ్యాకల్టీలో 161 గోల్డ్ మెడల్స్, 96 పీహెచ్‌డీలు, ఫార్మసీ ఫ్యాకల్టీలో 48 గోల్డ్ మెడల్స్, 21 సీహెచ్డీలు, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీలో 66 గోల్డ్ మెడల్స్, 49 పీహెచ్‌డీలు, సోషల్ సైన్సెస్ ఫ్యాకల్టీలో 88 గోల్డ్ మెడల్స్, 133 పీహెచ్‌డీలు, ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీలో 25 గోల్డ్‌మెడల్స్, 18 పీహెచ్‌డీలు, లా ఫ్యాకల్టీలో 72 గోల్డ్‌మెడల్స్, 4 పీహెచ్‌డీలు, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీలో 44 గోల్డ్‌మెడల్స్, 10 పీహెచ్‌డీలు ఇలా మొత్తం 564 గోల్డ్‌మెడల్స్, 387 పీహెచ్‌డీలు ప్రదానం చేస్తునట్లు వివరించారు.
స్నాతకోత్సవం అకాడమిక్ సెనేట్ సమావేశంతో ప్రారంభమవుతుందని, అనంతరం గవర్నర్, ముఖ్య అతిథి, వీసీ, రిజిస్ట్రార్, పూర్వ ఉప కులపతులు, కంట్రోలర్, డీన్లు, పాలకమండలి సభ్యులు, సెనేట్ సభ్యులతో కలిసి గ్రూప్ ఫొటో తీసుకుంటారని చెప్పారు. ఆ తర్వాత సెనేట్ సభ్యుల పొసేషన్ అనంతరం బంగారు పతకాలు, పట్టాల పంపిణీ కార్యక్రమం ఆడిటోరియంలో ఉంటుందని చెప్పారు. మధ్యాహ్నం 1:15 గంటలకు స్నాతకోత్సవం ముగుస్తుందని కార్యక్రమ నిర్వహణ కోసం ఒక స్టీరింగ్ కమిటీతో బాటు మొత్తం 10 సబ్ కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి కమిటీలో కన్వీనర్, కో కన్వీనర్లతో బాటు 10 మంది సభ్యులు ఉంటారని, టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులతో కలిపి వేసిన ఈ కమిటీలు సమన్వయంతో స్నాతకోత్సవం విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేస్తున్నారని వీసీ తెలిపారు.
కేయూ స్నాతకోత్సవాన్ని అడ్డుకుంటామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించిన నేపథ్యంలో వీసీ ప్రతాప్‌రెడ్డి శనివారం వారితో సమావేశమయ్యారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి కేయూ భూములు కేటాయించవద్దని డిమాండ్‌తో ఇప్పటికే విద్యార్థి సంఘాల నాయకులు రోజూ నిరసనలు చేపడుతుండటంతో స్నాతకోత్సవాన్ని అందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలని, ఎలాంటి నిరసనలు, ఆందోళనలు చేయవద్దని విద్యార్థులకు వీసీ సూచించారు.