హనుమకొండ చౌరస్తా, జులై 9: కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి, విశ్వవిద్యాలయ రుసా నోడల్ ఆఫీసర్ ఆర్.మల్లికార్జునరెడ్డి హైదరాబాద్‌లోని టీ-హబ్ కార్యాలయాన్ని సందర్శించి విశ్వవిద్యాలయం తరపున అవగాహన ఒప్పందానికి సంబంధించిన విధివిధానాలపై చర్చించారు. ఈ సందర్శన సందర్భంగా టీ-హబ్‌లో అందుబాటులో ఉన్న వసతులు, వనరులు, సదుపాయాలను పరిశీలించారు. ఈ వనరులు కాకతీయ విశ్వవిద్యాలయ కే-హబ్ అభివృద్ధికి ఎలా ఉపయోగపడతాయో, అలాగే రెండు పక్షాల బాధ్యతలు, అంకూర్ సంస్థలకు కావలసిన సదుపాయాలపై కూడా సమగ్రమైన చర్చ జరిపారు.
ఈ కార్యక్రమంలో టీ-హబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కవికృత్, టీ-హబ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ తాలుక్ పాల్గొని కే-హబ్ అభివృద్ధికి టీ-హబ్ తరపున పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు. తెలంగాణ రాష్ర్ట ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చొరవతో కాకతీయ విశ్వవిద్యాలయం కే-హబ్‌ను వరంగల్ వంటి టైర్- 2 పట్టణాల్లో తెలంగాణలో ఒక మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ఈ అవగాహన ఒప్పందం ముందుకు తీసుకువెళ్లబోతుందని వీసీ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఈ ఒప్పందం అమలైన వెంటనే కాకతీయ విశ్వవిద్యాలయంలో ఇన్నోవేషన్స్ , స్టార్టప్స్‌కు మంచి ప్రోత్సాహం లభిస్తుందని ఆయన తెలిపారు.