కన్నీటి పర్యంతమైన రైతన్న గుండెపై రామన్న ఓదార్పు సంతకం చేసిండు. బెంగటిల్లిన రైతన్నను ఓదారుస్తూ ఓరుగల్లు గడ్డపై ధైర్య వచనమై కదిలిండు. కాంగ్రెస్ సర్కార్ పెను తుఫానులో చిక్కిన రైతన్నకు చుట్టమై పలకరించిండు. అధైర్య పడొద్దని అభయం ఇచ్చిండు. ‘రాష్ట్రంలో రాబందు రాజ్యం పోవాలె.. మళ్లీ రైతుబంధు రాజ్యం రావాలె’ అని నినదించిండు. రేవంత్ సర్కార్ భూ మార్కెట్ మాయాజాలం గుట్టువిప్పి గుండె గుండెను మండించిండు. ఉమ్మడి వరంగల్ జిల్లాపై మంగళవారం కేటీఆర్ ఆత్మీయ సంతకం చేశారు. కష్టాల్లో ఉన్న రైతన్నను కలుసుకున్నారు. వారి కష్టసుఖాలను విన్నారు. రోజుల తరబడి మార్కెట్లో తాము పండించిన పంట కోసం పడిగాపులు గాస్తున్న రైతుల గోస విన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సర్కారు మొద్దునిద్ర వీడకుంటే అష్టదిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. జనగామ నుంచి మొదలుకొని నర్సంపేట వరకు కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ముందుగా జనగామ మండలం యశ్వంతాపూర్‌లోని మక్కల కొనుగోలు కేంద్రానికి స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కలిసి వెళ్లారు. కేంద్రంలోని మక్కలు పరిశీలించడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉపేంద్రమ్మ, విజయలక్ష్మి, నాగమణితో పాటు పలువురు రైతులను ఆప్యాయంగా పలుకరించి వారు తమ పంటలు అమ్ముకునేందుకు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం ఎంత భూమి ఉంది? ఎన్ని ఎకరాల్లో మక్కజొన్న వేశారు? ఎంత దిగుబడి వచ్చింది? సెంటర్‌కు పంట తెచ్చి ఎన్ని రోజులైంది? వర్షం వస్తే పరిస్థితి ఏమిటీ? రైతుబంధు వచ్చిందా? రుణ మాఫీ అయ్యిందా? కేసీఆర్ సర్కార్ హాయాంలో ఎట్లుండే..ఇప్పుడేట్లున్నది? అప్పటికీ ఇప్పటికీ తేడా ఉందా? లేదా? అనే విషయాలను తెలుసుకున్నారు. సమీపంలోని నిడిగొండ గోదాం హమాలీ కార్మికులు, లారీ ట్రాన్స్‌పోర్టు డ్రైవర్లతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
అక్కడి నుంచి వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఊకల్ సొసైటీ మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి సందర్శించారు. ఇక్కడ కూడా పలువురు మహిళా రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అక్కడి నుంచి నర్సంపేట మార్కెట్లోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, పార్టీ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి తదితరులతో కలిసి సందర్శించి రైతులు, హమాలీల సమస్యలు తెలుసుకున్నారు. తాము పండించిన పంట అమ్ముకోవడానికి రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే ఉండాల్సి వస్తున్నదని రైతులు కేటీఆర్‌కు తెలిపారు.
గన్నీ సంచులు ఇవ్వడం లేదని, కాంటాలు పెట్టడం లేదని, డబ్బులిచ్చిన వారి పంటనే కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉందని, వెంటనే కొనుగోలు చేయకపోతే తమ పంటంతా నీటిపాలయ్యే పరిస్థితి ఉందని వాపోయారు. బస్తాలు తామే తెచ్చుకుంటున్నామని, అయినా కాంటాలు వేయడం లేదని, వేసిన బస్తాలను గోదాములకు తరలించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాము పంటలు అమ్ముకున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా ఆయా చోట్ల కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఒక్కరోజు సమయమిస్తున్నామని, ఆలోగా మక్కల కొనుగోళ్లు ప్రారంభించకపోతే ఎక్కడికక్కడే రైతులతో కలిసి రోడ్డెక్కి రాష్ర్టాన్ని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. రాబందు ప్రభుత్వం పోవాలె.. మళ్లీ రైతుబంధు కేసీఆర్ ప్రభుత్వం రావాలన్నదే తెలంగాణ రైతుల నినాదమన్నారు. రాష్ట్రంలో భూములు అమ్ముడు.. ఢిల్లీకి మూటలు మోసుడే విధానంగా రేవంత్ పాలన సాగుతున్నదని ఆయన విమర్శించారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, ప్రభుత్వం మెడల వంచైనా పంటలు కొనుగోలు చేసేలా చూస్తామని భరోసా ఇచ్చారు.

Ktr