వరంగల్, జులై 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఓరుగల్లుకు ఉన్న చారిత్రక, సాంస్కృతిక చైతన్యం గొప్పదని, హైదరాబాద్ తరువాత అంతటి కీర్తి, ప్రాముఖ్యత ఉన్నది కూడా వరంగలేనని, దానిని ఆగం కానివ్వమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు, వేసిన ప్రణాళికలే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్‌కు ఏం చేసిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు మంత్రులున్నా వారిది ప్రేక్షక పాత్రేనన్నారు. గోదావరిలో నీళ్లున్నా రాష్ట్ర ప్రయోజనాలను రక్షించే కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ ప్రభుత్వం పడావు పెట్టిందని, అలాగే, ఉమ్మడి వరంగల్ జిల్లా సాగు, తాగునీటి ప్రయోజనాల కోసం ఉన్న దేవాదుల నీటిని విడుదల చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుంటే ఇక్కడి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
దేవాదులలో పంప్‌లు ఆన్ చేయాలని తాము కోరేదాకా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు సోయిలేకుండా పోయిందని ఆరోపించారు. గురువారం హనుమకొండ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక వైఖరిని ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు. అలాగే, ద్వితీయ శ్రేణి నగరాల నుంచి ఐటీ పరిశ్రమలు వెనక్కి వెళ్లకూడదని, ఈ క్రమంలో వరంగల్‌కు వచ్చిన ఒక్క ఐటీ పరిశ్రమ తిరిగి వెళ్లకుండా ఫుల్లెన్త్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను యథావిధిగా కొనసాగేలా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు.
రాష్ట్రంతోపాటు వరంగల్లోనూ తాము చేసిన పనులను చెప్పుకోవడంలో తాము విఫలమయ్యామని కేటీఆర్ తెలిపారు. వరంగల్ విషయానికి వస్తే దేశం గర్వించే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, ఇందులో తాము చేసిన అగ్రిమెంట్స్, కేసీఆర్ హయాంలో వచ్చిన పరిశ్రమలు మినహా కొత్తది ఒక్కటైనా వచ్చిందా? అని ప్రశ్నించారు. దక్షిణ కొరియాకు చెందిన యంగ్వన్, కేరళకు చెందిన కిటెక్స్, గణేశా వంటి సంస్థలను ఆయన ఉదహరించారు. విమానాశ్రయం ఉండాలని యంగ్వన్ సంస్థ అంటే మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణ కోసం పౌర విమానాయాన శాఖతో చేసిన ప్రయత్నాలను ఆయన వివరించారు. కాళోజీ కళాక్షేత్రం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, జిల్లాకో మెడికల్ కాలేజీ ఇలా అతి తక్కువ కాలంలోనే అనేక అద్భుతాలు చేసినా చెప్పుకోలేకపోయామని అన్నారు. అలాగే, ఇంకొన్ని పనులు మరింత ఎఫెక్టివ్‌గా చేయాల్సి ఉండేదని కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రజలెప్పుడూ గొప్పవాళ్లేనని, వారి ఆలోచనలు, ఆచరణలు గొప్పగానే ఉంటాయని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ అధినేత కేసీఆర్‌పై రాష్ట్రంలోనే కాదు వరంగల్లోనూ ప్రజాభిమానం గొప్పగా ఉందన్నారు. దసరా తరువాత ప్రజాభీష్టాన్ని ప్రతిబింబించేలా సంస్థాగత నిర్మాణం చేపట్టి పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తామన్నారు. వరంగల్ చారిత్రక వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ముందుకు సాగుతామన్నారు.