హనుమకొండ, ఫిబ్రవరి 18 : గెలుపోటములకు అతీతమైన స్ఫూర్తి కేవలం క్రీడల్లోనే కాదు రాజకీయాల్లోనూ ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఇటీవల కేసీఆర్ క్రికెట్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించగా విజేతలకు మంగళవారం హైదరాబాద్‌లో కేటీఆర్ బహుమతులు ప్రదానం చేశారు. క్రీడాకారుల కోసం ఏటా పశ్చిమ నియోజకవర్గంలో కేసీఆర్ క్రికెట్ చాంపియన్‌షిప్‌తో పాటు వాలీబాల్, ఖోఖో పోటీలను నిర్వహిస్తున్న బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాసర్కు అభినందనలు తెలిపారు. పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం దాస్యం పనిచేస్తున్నారని అన్నారు.
అధికారం లేకున్నా ప్రజల కోసం బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటున్నారని రామన్న ప్రశంసించారు. ప్రజల ఆశీర్వాదం, ముఖ్యంగా యువకుల పట్టుదలతో కేసీఆర్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని కేటీఆర్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీఆర్ఎస్దే విజయమని కేసీఆరే మన ముఖ్యమంత్రి అని అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ క్రికెట్ కప్-2025 విన్నర్‌గా 54వ డివిజన్, రన్నరప్‌గా 49వ డివిజన్ నిలువగా కేటీఆర్ వారికి ట్రోఫీ అందజేశారు. అలాగే ఇతర పోటీల్లోనూ సత్తా చాటిన వారిని అభినందించారు. కార్యక్రమంలో ఆర్గనైజర్స్ కాకతీయ క్రికెట్ అకాడమీ ఫౌండర్ ఫారుక్, సభ్యులు మాజిద్, అస్లాం, షాకీర్, వీరు, సిరాజ్, రాజేశ్‌కుమార్, డెక రాంబాబు, ఫర్దిన్, నాయకులు పులి రజనీకాంత్, జోరిక రమేశ్, రామ్మూర్తి, బుద్ధ వెంకన్న, పెద్దిరాజు, ప్రణయ్, యాదగిరి, రఘు పాల్గొన్నారు.