వరంగల్, ఏప్రిల్ 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎల్కతుర్తిలో జరగబోతున్న సభ ఆషామాషీ సభ కాదని, దేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోయే మహాసభగా నిలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మొదటినుంచీ గులాబీ జెం డాకు ఉమ్మడి వరంగల్ జిల్లా అండగా ఉన్నదని పేర్కొన్నారు. ఉద్యమ ప్రస్థానంలో ఏ కష్టమొచ్చినా, ఏ ఇబ్బం ది వచ్చినా కేసీఆర్ తిరిగి చూసింది వరంగల్ వైపే. జయప్రదంగా, అద్భుతంగా ఇక్కడ ఎన్నో మహాసభలు నిర్వహించుకున్నామని చెప్పారు. బీఆర్ఎస్కు 24 ఏండ్లు నిండి 25 సంవత్సరంలో అడుగు పెడుతున్న రజతోత్సవ వేడుకకు వరంగల్ వేదిక కావడం మనందరికీ గర్వకారణమని అన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యకర్తలు, నాయకులందరి కోరిక మేరకు మరో మహాసభకు వరంగల్‌ను వేదికగా ఎంచుకున్నామని చెప్పారు. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభతో తెలంగాణ సాధన ఉద్యమం నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయని అన్నారు. రాజకీయ పార్టీకి రజతోత్సవం అనేది గొప్ప విషయమని బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు రజతోత్సవం ఒక ఉత్కృష్ట సందర్భమని తెలిపారు. రజతోత్సవం సందర్భంగా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరుగనున్న రజతోత్సవ మహాసభ ఏర్పాట్లను కేటీఆర్ బుధవారం మధ్యాహ్నం మం డుటెండలో పరిశీలించారు. సభా ప్రాంగణం, వేదిక, పార్కింగ్, వైద్య సేవలు, తాగునీరు, ఇతర అన్ని పనులను పర్యవేక్షించారు. అనంతరం ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కలిసి మహాసభ ప్రాంగణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రజతోత్సవ మహాసభకు వస్తున్న జనాలతో ఈ రోజు ఒక దృశ్యం చూస్తే చాలా గొప్పగా అనిపించిందన్నారు. ఉద్యమ సమయంలో వరంగల్‌లో సభ జరిగినప్పుడు నర్సంపేట, పరకాల నుంచి ప్రభ బండ్లు వచ్చేవని, ఇప్పుడు సూర్యాపేట నుంచి బయలుదేరాయని తెలిపారు. గతంలో వరంగల్‌లో సభలు పెట్టినప్పుడల్లా భారీగా వచ్చే జనం, వాహనాలతో వరంగల్ నుంచి జనగామ వరకు ట్రాఫిక్ జామ్ అయ్యేదని, ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా 2వేల మంది వలంటీర్లను నియమించుకున్నామని చెప్పారు. ఏప్రిల్ 27న మొత్తం రాష్ట్రంలోని 12,796 గ్రామ పంచాయతీల్లో.. అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీ వార్డుల్లో ఎక్కడికక్కడ గులాబీ జెండాలు ఎగురవేసి బయలుదేరాలని కోరారు.
ఆ రోజు సాయంత్రం 4.30 గంటలకు కేసీఆర్ మహాసభ ప్రాంగణానికి చేరుకుంటారని, సాయంత్రం 5.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని అంతకంటే ముందుగానే అందరూ ఇక్కడికి చేరుకోవాలన్నారు. ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ నిర్వహించే సభ ప్రభుత్వం మీద పోరాటానికో, ప్రజలను రెచ్చగొట్టేందుకు చేస్తున్నదో కాదని చెప్పారు. శాంతియుతంగా, బీఆర్ఎస్ 25వ వార్షికోత్సవం రజతోత్సవాన్ని జరుపుకొంటున్నామని, ఇప్పటివరకు ఉన్నట్లుగానే రాబోయే మూడు నాలుగు రోజులు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరించాలని జిల్లా యంత్రాంగానికి, పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు.
మహాసభ కోసం 20రోజులుగా ఉమ్మడి జిల్లా నాయకులు చాలామంది కష్టపడుతున్నారని కేటీఆర్ అభినందించారు. ‘సోదరులు దాస్యం వినయ్‌భాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, గ్యాదరి బాలమల్లు, స్థానిక మాజీ శాసనసభ్యులు సతీశ్‌కుమార్ పూర్తిస్థాయిలో నిమ్నగమై ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాజయ్య, సత్యవతి రాథోడ్, శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రెడ్యానాయక్, కవిత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ రవీందర్రావు అందరూ వారి వారి నియోజకవర్గాల్లో జనసమీకరణ, అక్కడినుంచి ప్రజల పెద్దఎత్తున తరలివచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు’ అని కేటీఆర్ అన్నారు.