ఐనవోలు, నవంబర్ 7: ఎమ్మెల్యే గారు.. స్థానిక సమస్యలు మరిచి విపక్ష పార్టీల నేతలపై విమర్శలేమిటని ఐనవోలు మండలం కొండపర్తి గ్రామస్తులు వాట్సాప్ వేదికగా మండిపడ్డారు. వివరాల్లోకి వెళ్తే… జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రసంగాలపై వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు విమర్శలు చేశారు. దీనికి సంబం ధించిన వీడియోను ఎమ్మెల్యే అఫీసు సిబ్బంది గురువారం వాట్సాప్ గ్రూప్‌ల్లో వైరల్ చేశారు. దీనిపై స్పందించిన కొండపర్తి గ్రామస్తులు ఓ వాట్సాప్ గ్రూపు వేదికగా ఎమ్మెల్యే నాగరాజు వీడియోను ట్యాగ్ చేస్తూ ‘ ఎమ్మెల్యే గారు.. ముందు రాష్ట్ర సమస్యలు కాదు.. మా గ్రామ సమస్యలను పరిష్కరిస్తే చాలు’ అని సూచించారు.
కొండపర్తి గ్రామానికి నాలుగు దిక్కులా నూతనంగా బీటీ రోడ్లు వేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 అక్టోబర్‌లో సుమారు రూ. 13 కోట్లు మంజూరు చేసి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించింది. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొండపర్తి నుంచి ఐనవోలు రోడ్డు మినహా మి గిలిన మూడు రోడ్లను పట్టించుకోలేదు. దీంతో రెండేళ్లుగా గ్రామస్తులు గుంతలమయమైన రోడ్లతో నరకయాతన పడుతున్నారు. గ్రామానికి ఏ నాయకుడు, అధికారి వచ్చినా రోడ్లను బాగు చేయండి అంటూ తమ గోడును వెలిబుచ్చుతున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే నాగరాజును పలు మార్లు కోరడంతో పాటు ఓ సందర్భంలో నిలదీశారు.